Search This Blog

Sunday 10 August 2014

మహా సంగ్రామంలో మహ‘రాణులు’

‘స్వాతంత్య్ర’ స్మృతులు 
స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న తొలితరం మహిళలు అనగానే అందరికీ గుర్తుకొచ్చేది ఝాన్సీలక్ష్మీబారుునే. ఆమె కంటే 300 ఏళ్ళు ముందుగా, 16వ శతాబ్దిలోనే పరారుుపాలనపై ధ్వజమెత్తిన వారు ఎందరో ఉన్నారు. అందులో రాణి అబ్బాకరాణి ముందు వరుసలో ఉంటారు. కర్ణాటకలోని తుళునాడును పాలించిన ఈమె పోర్చుగీసు వారిపై మెుట్టమెుదటగా తిరుగుబాటు చేశారు.చౌత రాజవంశానికి చెందిన అబ్బాక రాణి 16వశతాబ్దిలో కర్నాటకలో మంగళూరు సమీ పంలోని తుళునాడును పాలించింది. టెంపుల్‌ టౌన్‌గా పేరొందిన మూడాబీద్రీని పాలించింది. మంగళూరుకు సమీపంలోని ఉల్లాల్‌ అనే రేవుపట్టణం ఈ రాజ్యానికి అనుబంధ రాజధానిగా ఉండేది. ఈ రేవుపట్టణాన్ని స్వాధీనం చేసుకునేందుకు పోర్చుగీసు వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు. వ్యూహాత్మకంగా అది వారికెంతో కీలకంగా ఉండింది.

abbak-raniఅబ్బాక రాణి తన ధైర్యసాహసాలతో వారిని ఎదుర్కొంది. అందుకే ఆమెను ‘అభయ రాణి’గా అభివర్ణించేవారు. నాలుగు దశాబ్దాల పాటు ఈ విధమైన దాడులు జరిగాయి. ఉల్లాల్‌ నగరం ఆమె స్వీయపాలనలో ఉండేది. పొరుగునే ఉన్న మంగళూర్‌ రాజ్య అధిపతి లక్ష్మప్ప అరసతో ఆమెకు వివాహం చేయాలని ఆమె మేనమామ తిరుమల రాయ తదితర పెద్దలు నిర్ణయించారు. తిరుమల రాయ చిన్నతనం నుంచే అబ్బాక రాణికి యుద్ధవిద్యల్లో శిక్షణ ఇప్పించారు. ఈ వివాహం జరగడం పోర్చుగీసు వారికి ఇష్టం లేకపోయింది. పెళ్ళి జరిగినా అది కొంతకాలమే నిలిచింది. భార్యాభర్తలు విడిపోయారు. ప్రతీకారేచ్ఛతో రగిలిన భర్త పోర్చుగీసు వారితో చేతులు కలిపి అబ్బాకపై యుద్ధం ప్రకటించాడు.

ఇదీ నేపథ్యం
గోవాపై ఆధిపత్యం సాధించిన పోర్చుగీసు వారు తీరప్రాంతంపై తమ పట్టు మరింత పెంచుకునేందుకు ప్రయత్నించారు. 1525లో వారు దక్షిణ కర్ణాటక తీరంపై కన్నేశారు. మంగళూరు ఓడరేవును ధ్వంసం చేశారు. అప్పటికే ఉల్లాల్‌ ఓడరేవుగా వృద్ధి చెందుతూ ఉండింది. పశ్చిమాన అరేబియా తదితర దేశాలతో సంబంధాలను కలిగి ఉండింది. ఈ లాభదాయక ఓడరేవుపై పోర్చుగీసు కన్నుపడింది. డచ్‌, బ్రిటిష్‌ వారు కూడా దీనిపై కన్నేశారు. స్థానిక రాజులంతా ఒక్కటై వీరి ప్రయత్నాలను వమ్ము చేశారు.అబ్బాక రాణి జైన మతాన్ని అవలంబించినా హిందువులు, ముస్లింలు కూడా పాలనాధికారులుగా ఉండేవారు.

errakotasపొరుగురాజ్యాలతో స్నేహసంబంధాలుండేవి. అబ్బాక రాణి వ్యూహాలకు పోర్చుగీసు వారు చిత్తయిపో యేవారు. తమకు కప్పం చెల్లించాల్సిందిగా వారు రాణిని కోరారు. అందుకు అమె తిరస్కరించారు. దీంతో 1555లో పోర్చుగీసు వారు అడ్మిరల్‌ డోమ్‌ అల్వారో డా సిల్వేరియాను ఆమెతో యుద్ధం చేసేందుకు పంపించారు. ఈ దాడిని అబ్బాక రాణి సమర్థంగా తిప్పిగొట్టగలిగింది. 1557లో పోర్చుగీసు వారు మంగళూరును ఆక్రమించి దాన్ని ధ్వంసం చేశారు. 1568లో మరోసారి ఉల్లాల్‌పై దాడికి ప్రయత్నిం చారు. ఈసారి వారు పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటుగా కోటలోకి కూడా ప్రవేశించగలిగారు. అబ్బాక రాణి కోట నుంచి తప్పించుకొని ఓ మసీదులో ఆశ్రయం పొందింది.

అదే రోజు రాత్రి ఆమె 200 మంది సైనికులను సమీకరించి తిరిగి పోర్చుగీసు వారిపై దాడికి పాల్పడింది. పోర్చుగీసు సేనాని జనరల్‌ పెక్సిటో హతమయ్యాడు. 70 మంది పోర్చుగీసు సైనికులు బందీలుగా చిక్కారు. పోర్చుగీసు దళాలు వెనక్కు వెళ్ళాయి. అబ్బాక రాణి ధాటికి తట్టుకోలేక పోర్చుగీసు వారు మంగళూరును కూడా వీడి వెళ్ళారు. 1569లో తిరిగి పోర్చుగీసు వారు మంగళూ రును, కుందపూర్‌ (బస్‌రూర్‌)ను స్వాధీనం చేసుకోగలిగారు. అప్పటికీ అబ్బాక రాణి వారికి పక్కలో బళ్ళెంలా ఉండింది. దీంతో వారు రాణి భర్తను తమ వైపు తిప్పుకొని దాడులకు పాల్పడ్డారు.

1570లో అబ్బాక రాణి బీజాపూర్‌ సుల్తాన్‌ (అహ్మద్‌నగర్‌), కాలికట్‌ రాజులతో ఒప్పందాలు కుదుర్చుకుంది. వారు కూడా పోర్చుగీసును వ్యతిరేకించే వారు. కాలికట్‌కు చెందిన సేనాని కుట్టి పోకర్‌ మార్కర్‌ అబ్బాక రాణి తరఫున మంగళూరులో పోర్చుగీసువారిపై యుద్ధం చేసి పోర్చుగీసు కోటను ధ్వంసం చేసినా, తిరుగు ప్రయాణంలో పోర్చుగీసు వారి చేతిలో హతమ య్యా డు. ఈ పరాజ యాలకు తోడు భర్త ద్రోహం కారణంగా అబ్బాక రాణిని పోర్చుగీ సు వారు బందీ గా పట్టు కోగలి గారు. ఖైదులో నూ ఆమె తిరగబడి, పోరాటం చేస్తూనే మరణించింది.

తుళులో ఇప్పటికీ అబ్బాక రాణి విజయగాధలను పిల్లలకు చెబుతుంటారు. నాటకాలుగా, యక్షగానాలుగా ప్రదర్శిస్తుం టారు. ఆనాటి వర్ణనల ప్రకారం అబ్బాక రాణి నల్లగా ఉన్నా అందంగా ఉండేది. సాధారణ దుస్తులు ధరించేది. కాళ్ళకు పాదరక్షలు లేకుండానే ఇంటా, బయటా తిరిగేది. రాత్రిం బవళ్ళు విధినిర్వహణ చేసేది. ఆమెకు ఇద్దరు కూతుళ్ళు ఉండేవారని చెబుతారు. వారు కూడా తల్లితో పాటుగా యుద్ధాల్లో పాల్గొన్నారు. పోర్చుగీసు వారిపై బాణాలతో ఆమె ‘అగ్నివాన’ కురిపించిందని, దేశంలో ఆ విద్య తెలిసిన చివరి వ్యక్తి ఆమేనని అంటారు. ఉల్లాల్‌లో నేటికీ ఆమె జ్ఞాపకార్థం ఏటా ఓ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుంటారు. 2003 జనవరి 15న భారతీయ తపాల శాఖ ఓ ప్రత్యేక స్టాంపును కూడా ఆమె స్మారకార్థం విడుదల చేసింది. ఉల్లాల్‌, బెంగళూరులో ఆమె కాంస్య విగ్రహాలు న్నాయి. ఆమె పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకం.

ఝాన్సీ లక్ష్మీబాయి
raniభావితరాలకు పోరాట స్ఫూర్తినిచ్చిన ధీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి. ఝాన్సీ రాజు గంగాధరరావు ఆమెను వివాహం చేసుకున్నారు. ఆయన మరణానంతరం దత్తు తీసుకునేందుకు బ్రిటిష్‌ వారు లక్ష్మీబాయిని అనుమతిం చలేదు. ఆ రాజ్యాన్ని విలీనం చేసుకునేందుకు కుట్ర పన్నారు. దీంతో లక్ష్మీబాయికి యుద్ధం చేయకతప్పలేదు. పురుష వేషధారణలో ఆమె కదనరంగంలోకి దూకారు. ఆమె నేతృత్వం లో సైనికదళాలు వీరోచిత పోరాటం చేశాయి. ఆమె ధైర్యసా హసాలు బ్రిటిష్‌ వారిని సైతం మంత్రముగ్ధులను చేశాయి.

సరోజిని నాయుడు
sarojini-naiduగోఖలేతో 1906లో జరిగిన సమావేశం సరోజిని నాయుడు జీవితాన్ని మార్చేసింది. దీంతో ఆమె బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా పోరుబాట పట్టారు. 1917-19మధ్య కాలంలో ఆమె క్లెమ్స్‌ఫోర్డ్‌ సంస్కరణలు, ఖిలాఫత్‌ అంశం, రౌలత్‌ యాక్ట్‌, సత్యాగ్రహం తదితరాలపై విసృ్తతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. గాంధీ పిలుపు మేరకు పౌర సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 1930లో ఉప్పు సత్యాగ్రహానికి నేతృత్వం వహించేందుకు గాంధీజీ ఆమెను ఎంచుకోవడం విశేషం. సత్యాగ్రహం సందర్భంగా గాంధీజీని పోలీసులు అరెస్టు చేశారు. ఆ సమయంలో ఆమె లాఠీలకు, తుపాకులకు వెరవక పోలీసు అధికారిని తోసివేస్తూ ఉక్కు కంచెలను దాటుకెళ్ళారు. గోఖలే సూచన మేరకు ఆమె కవిత్వాన్ని పక్కనబెట్టి స్వాతంత్రోద్యమంలో దూసుకెళ్ళారు. గాంధీ వెంట ఇంగ్లాండ్‌లో పర్యటించారు. అక్కడ కూడా ఆమె ఎంతో ధైర్యంతో బ్రిటిష్‌ పాలనను విమర్శించారు.

కస్తుర్బాగాంధీ (1869 ఏప్రిల్‌ 11- 1944 ఫిబ్రవరి 22)
Kasturba-Gandhi2గాంధీజీ భార్యగా ఆయన అడుగుజాడల్లో నడిచిన మహిళ. మహిళలు చేపట్టిన సత్యాగ్రహాలకు ఆమె నాయకత్వం వహించే వారు. పన్ను చెల్లింపు నిరాకరణ, విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమాలకు నేతృత్వం వహించి అరెస్టయ్యారు. 13 ఏళ్ళ వయస్సులో ఆమెకు వివాహం జరిగింది. అప్పట్లో ఆమెకు చదువు రాదు. గాంధీ స్వయంగా ఆమెకు చదవడం, రాయడం నేర్పించారు. భర్తకు వెన్నంటి నిలిచినా, ఆయన చెప్పినదా నికల్లా తలాడించే వారు కాదు. ఆమెకు నచ్చచెప్పేందుకు గాంధీ శ్రమించాల్సి వచ్చేది. ఆధ్యాత్మిక చింతన అధికం. 1897లో భర్తతో పాటు దక్షిణాఫ్రికా వెళ్ళారు. 1914 వరకు కూడా అక్కడ భర్త చేపట్టిన పోరాటాల్లో పాలు పంచుకున్నారు. ఆమె క్రానిక్‌ బ్రాంకటైస్‌తో బాధపడుతుండేది. క్విట్‌ ఇండియా ఉద్యమ ఒత్తిళ్ళతో ఆరోగ్యం దెబ్బతింది. న్యుమోనియాతో బాధపడుతూ హార్ట్‌ ఎటాక్‌తో మృతి చెందారు. భర్తతోపాటు జైల్లో ఉండగానే, భర్త ఒడిలోనే తుదిశ్వాస విడిచారు.

సుచేత కృపలానీ
SuchetaKriplani-liveస్వాతంత్య్రపోరాటంలో పాల్గొన్న సుచేత కృపలానీ పలుమార్లు జైలుకెళ్ళారు. 1946లో ఆమె రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు. ధైర్యసాహసాలకు ఆమె ప్రతీక అంటూ ఇందిరాగాంధీ ఆమెను అభివర్ణించారు. హర్యానాలోని అంబాలలో బెంగాలీ కుటుంబంలో ఆమె జన్మించారు. తండ్రి ప్రభుత్వ వైద్యుడైనప్పటికీ జాతీయ భావాలు కలవాడు. మొదట్లో ఆమె బనారస్‌ హిందూ యూనివర్సిటీలో అధ్యాపకురాలిగా పని చేశారు. 1936లో ఆమె సోషలిస్టు అయిన ఆచార్య కృపలానీని వివాహమాడారు. అనంతరం జాతీయ కాంగ్రెస్‌లో కీలకపాత్ర నిర్వహించారు. అరుణ అసఫ్‌అలీ, ఉషా మెహతాల మాదిరిగా క్విట్‌ఇండియా సందర్భంగా తీవ్ర పోరాటం చేశారు. విభజన దాడుల సందర్భంగా మహాత్మాగాంధీతో కలసి పని చేశారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు ఏర్పడిన సభకు ఎన్నికైన కొద్దిమంది మహిళల్లో ఆమె ఒకరు. 1947 ఆగస్టు 15న రాజ్యాంగసభలో ఆమె వందేమాతరం గేయం ఆలపించారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా ఆమె రాజకీయాల్లో కొనసాగారు.

విజయలక్ష్మి పండిట్‌
Vijayalakshmi-Panditనెహ్రూకు స్వయాన సోదరి అయిన విజయ లక్ష్మి పండిట్‌ ఝాన్సీ లక్ష్మీబాయి, సరోజినీనాయుడుల నుంచి స్ఫూర్తి పొందారు. సహాయ నిరాకరణోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1932లో అరెస్టయి ఏడాది కాలం జైల్లో ఉన్నారు. 1940లో, తిరిగి క్విట్‌ ఇండియా సందర్భంగా అరెస్టయ్యారు. 1936 లో, 1946లో ఉత్తరప్రదేశ్‌ అసెం బ్లీకి ఎన్నికయ్యారు. నాటి మంత్రి వర్గంలో మొదటి మహిళామంత్రి ఆమె. ఐరాస సాధారణ అసెంబ్లీ మొదటి మహిళా అధ్యక్షురాలు.

కమలానెహ్రూ (1899-1936)
kamala-nehruజవహర్‌లాల్‌ నెహ్రూతో పాటుగా ఆయన కుటుంబానికి చెందిన వారెంతో మంది స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. అలాంటివారిలో నెహ్రూ భార్య కమలానెహ్రూ ఒకరు. ఫిబ్రవరి 8న వారి వివాహం జరిగింది. నాటి నుంచి స్వాతంత్య్ర పోరాటంలో భర్తకు వెన్నంటి నిలిచారు. అలహాబాద్‌ను ఆమె కార్యక్షేత్రంగా ఎంచుకున్నారు. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆమె నెహ్రూ కుటుంబీకుల పాశ్చాత్య ధోరణులకు అలవాటు పడ్డారు. సహాయనిరాకణోద్యమం సందర్భంగా అలహాబాద్‌లో మహిళలతో ఉద్యమం చేయించారు. విదేశీ వస్తువులను అమ్మే దుకాణాల ఎదుట ధర్నా నిర్వహించారు. భర్తపై ఆమె ప్రభావం తక్కువే. భర్త జైలులో ఉన్న సమ యంలో స్విట్జర్లాండ్‌లో ఆమె ట్యుబర్‌కులోసిస్‌తో మరణించారు. కస్తుర్బా గాంధీతో కొన్నాళ్ళు ఆశ్రమంలో ఉన్నారు. జయప్రకాష్‌ నారాయణ్‌ భార్య ప్రభావతి దేవి ఆమెకు మంచి స్నేహితురాలు.

ఇందిరాగాంధీ
indira-gandhi2స్వాతంత్య్ర సమర యోధులకు సాయం చేసేందుకు పిల్లలతో వానరసేను ఏర్పాటు చేసిన ఇందిరాగాంధీ ఎంతో చురుగ్గా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. 1938లో ఆమె కాంగ్రెస్‌ సభ్యత్వం స్వీకరించారు. 1941 నుంచి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.

పద్మజా నాయుడు
padmaja-naiduసరోజిని నాయుడు కుమార్తె పద్మజా నాయుడు. తల్లి అడుగుజాడల్లో నడిచి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. 21ఏళ్ళ వయస్సులోనే ఆమె జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర వహించగలిగారు. హైదరా బాద్‌లో భారత జాతీయ కాంగ్రెస్‌ శాఖను నెలకొ ల్పారు. ఖాదీ వాడకంపై విసృ్తతంగా ప్రచారం చేశారు. విదేశీ వస్తు బహిష్కరణపై చైతన్యం కలిగిం చారు. 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొ న్నారు. స్వాతంత్య్రం అనంతరం పశ్చిమ బెంగాల్‌కు గవర్నర్‌గా నియుక్తులయ్యారు.

బేగమ్‌ హజ్రత్‌ మహల్‌
BEGUM-HAZRAT-MAHAబ్రిటిష్‌ వారి నుంచి లక్నో రాజ్యాన్ని కాపాడుకునేందుకు యత్నించిన ధీర. ఆమె రాణి అయినప్పటికీ, సైనికులకు ఉత్సాహం కలిగించేందుకు స్వయంగా యుద్ధరంగానికి వచ్చేవారు. క్షమాభిక్ష పెడుతామని, అలవెన్సులు ఇస్తామని బ్రిటిష్‌ వారు ముందుకు వచ్చినప్పటికీ తోసిపుచ్చారు. బ్రిటిష్‌ వారిచేతిలో పరాజయం పాలై నేపాల్‌లో ఆశ్రయం పొందారు. ఆమె నవాబ్‌ వాజిద్‌ అలీ షా భార్య. ఆమె సౌందర్యవతి మాత్రమే గాకుండా గొప్ప పాలనాదక్షురా లిగా ఉండేది. ప్రథమ స్వాతంత్య్ర పోరాటం (1857- 58)లో ఆమె బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడారు. నానాసాహెబ్‌ లాంటి వారితో కలసి పని చేశారు. 1879లో నేపాల్‌లోనే మరణిం చారు. ఖాట్మండులోని జామామసీదు లోనే ఆమె భౌతికకా యాన్ని ఖననం చేశారు.

అరుణ అసఫ్‌ అలీ
Aruna-Asaf-Aliహర్యానాలోని కల్కాలో బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. లాహోర్‌, నైనిటాల్‌లో విద్యాభ్యాసం చేశారు. మొదట్లో కోల్‌కతాలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తూ, దేశంలోని పరిస్థితి చూసి చలించి పోరాటంలోకి దిగారు. అలహాబాద్‌లో ఒకసారి అసఫ్‌ అలీతో సమావేశమైన తరువాత, వారిమధ్య ప్రేమ చిగురించింది. తన కన్నా 20 ఏళ్ళు పెద్దవాడైన అసఫ్‌అలీని వివాహం చేసుకుంది. కాంగ్రెస్‌ పార్టీలో చురుకైన పాత్ర నిర్వహించారు. ఉప్పు సత్యాగ్రహం తదితరాల్లో పాల్గొన్నారు. 1931లో ఇతర నిరసనకారులతో ఆమెను అరెస్టు చేశారు. అందరినీ విడుదల చేసినా ఆమెను మాత్రం ప్రభుత్వం విడుదల చేయలేదు. తీవ్ర ప్రజాందోళనల నేపథ్యంలో గాంధీజీ జోక్యంతో ఆమెను విడుదల చేయకతప్పింది కాదు. రాజకీయ ఖైదీల పట్ల వివక్షకు వ్యతిరేకంగా ఆమె తీహార్‌జైల్లో నిరాహారదీక్షకు దిగారు. దాంతో జైలు పరిస్థితులు మెరుగుపడినా, ఆమెను మరో జైలుకు మార్చారు. 1942లో ముంబయిలో క్విట్‌ ఇండియా తీర్మానం చేయగానే ప్రభుత్వం కాంగ్రెస్‌ నేతలను అరెస్టు చేసింది. ఆ సమయంలో ఆమె కాంగ్రెస్‌ పతాకాన్ని ఆవిష్కరించి ఉద్యమాన్ని ప్రారంభించారు. హీరోయిన్‌ ఆఫ్‌ ది 1942 మూవ్‌మెంట్‌గా ఆమెను నాటి నేతలు అభివర్ణించేవారు.
                                                                                                           -హైమ సింగతల
                                                                                                                                                                     (సూర్య దినపత్రిక August 15, 2011)

No comments:

Post a Comment