Search This Blog

Sunday 10 August 2014

ముంగిళ్ల మెరిసే రంగుల సందేశాలు...

రోజూ వేసే రంగు రంగుల ముగ్గులను చూస్తేనే తెలుస్తుంది... ఇది ధనుర్మాసమని, వచ్చేది సంక్రాంతి పండుగని... ఈ పండుకు నెల రోజుల ముందు నుండే సందడి మొదలవుతుంది. మాసం మొత్తం పండుగ వాతావరణాన్ని తలపింపజేస్తుంది. ప్రతీ గడపా రంగు రంగుల ముగ్గులతో ముస్తాబవుతుంది. భారతీయ సంప్రదాయంగా ఎన్నో వందల ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న ముగ్గుల సంప్రదాయం కేవలం అలంకరణ కోసమే కాదు.. ఆరోగ్యం... అందం.. ఆనందం కోసం కూడా.. అటువంటి ఈ ముగ్గుల కథేంటో తెలుసుకుందాం..

rangoli1సంక్రాంతి పండుగ అంటేనే మిగిలిన వాటికి ఎంతో ప్రత్యే కమైంది. పల్లెటూళ్లలో ధాన్యం ఇళ్లకు చేరే సమయం.. అన్ని గడపలూ ఆనందంతో నిండిపోతాయి..పైగా సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశించే పవిత్రమైన ధనుర్మాసం.. మిగిలిన పండుగలన్నీ చాంద్రమానాన్ని అనుసరించి చేసుకున్నా ఈ పండుగకు మాత్రం సౌరమానాన్ని అనుసరిస్తారు. అందుకే ఈ పండుగకు ఎంతో ప్రత్యేకత వుంటుంది.

రంగోలి...
రంగోలి అనేది ఉత్తర భారతదేశంలో ముగ్గుకు మరో పేరు. ముగ్గు, రంగవళ్లి అనేది మన తెలుగు భాషలోని పేరు. బెంగాలీ లో అల్పానా, తమిళ్‌లో కోలమ్‌, అని ఎలా పిలిస్తారు. పేరు ఏదై నా వ్యక్తీకరణ సృజనాత్మకమే. 

గ్రామీణ ప్రాంతాల్లో... 
గతంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లను ఎర్రమన్నుతో కట్టుకునే వారు. అలా కట్టుకున్న ఇంటికి మట్టిపేడను కలిపి అలికేవారు. దీని వల్ల దుమ్ముధూళి వంటివి ఇంట్లోకి రాకుండా అణగి పోయే వి. పురుగులు వంటివి రాకుండా బియ్యపు పిండితో ముగ్గులు పెట్టేవారు. వీటి వల్ల అవి ఆ బియ్యం పిండిని ఆహారంగా తీసుకు ని ఇంట్లోకి రాకుండా పోయేవట. 

దక్షిణ భారతదేశంలో.. 
rangoli3దక్షిణ భారతదేశంలోని పల్లెటూళ్లలో ఇప్పటికీ పేడ నీటిని చల్లి బియ్యపు పిండితో ముగ్గులు పెట్టుకునేవారున్నారు. ఇప్పుడు చాలావరకు బియ్యపు పిండికి బదులు ముగ్గురాళ్ల పొడి దొరుకుతుంది. దీని ద్వారా వేసు కుంటున్నారు. 

స్వాగత అలంకారం... 
ధనుర్మాసం విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది. ఈ మాసంలో విష్ణుమూర్తి భూమి మీదకు వస్తా రని నమ్ముతారు. ఈ మాసంలోనే స్వర్గపు ద్వారాలు కూడా తెరు చుకుంటాయనేది మన పెద్దల నమ్మకం.అందుకే మహిళలంతా ఉదయాన్నే తొందరగా లేచి ఇంటి ముందు శుభ్రం చేస్తారు. పేడను నీటిలో కలిపి చల్లుతారు. ఇంటి ముందు అందమైన రంగ వల్లులను తీర్చిదిద్దుతారు. ఈ ముగ్గులను వేసుకునేప్పుడు విష్ణునామస్మరణ చేస్తూ పూర్తి చేస్తారు. 

ముగ్గులలో గొబ్బిళ్లు...
ఈ నెల మొత్తం ఆవు పేడను ముద్దలుగా చేసి ముగ్గుల మధ్యలో పెడతారు. వీటిని గొబ్బెమ్మలు అంటారు. ఇది గౌరీమాతను పూజించడంలో ఓ భాగంగా వస్తోంది. ఈ గొబ్బెమ్మళ్లను పసుపు కుంకుమలతో అలంకరించి మధ్యలో గుమ్మడి లేదా బంతి పూల ను పెడతారు. పెద్దదాన్ని ముగ్గు మధ్యలో పెట్టి చిన్న చిన్న వాటిని వాటి చుట్టూ పెడతారు. 

కోరికలు తీర్చమంటూ...
చిన్న చిన్న పిల్లలు, ెపెళ్ళికాని యువతులు మంచి భర్త రావాలని ఈ ముగ్గుల చుట్టూ పాటలు పాడుతూ గొబ్బి తడతారు. పెళ్లైన మహిళలు తమ దాంపత్య జీవితం బాగా గడవాలని కోరుతూ ఈ వేడుకను చేసుకుంటారు. 

వేడుకల అనంతరం..
rangoliరోజూ ముగ్గులలో పెట్టే గొబ్బిళ్లను తీసి ఎండలో ఎండబెడతారు.వీటిని పండుగ రోజు సూర్యభగవానుడికి నైవేద్యంగా పెట్టే తీపి అన్నం(పాయసం)వండేందుకు పిడకలుగా వుపయోగిస్తారు. ఇప్పటికీ పల్లెటూళ్లలో వీటినే వంట చేసుకునేందుకు వుపయోగి స్తారు. ఇవి ప్రకృతికి ఎంతో మేలు చేస్తాయి కూడా. 

రెండు రకాలు..
ఈ ముగ్గులలోనూ రెండు రకాలు వున్నాయి.. అవి ఒకటి చుక్క లు పెట్టి వేసేవి. మరొకటి డిజైన్స్‌..వీటికి ఏ చుక్కలూ అవసరం లేదు. సృజనాత్మకంగా తమ మనసులోని రూపాలను వేయడం అన్నమాట. ఏది ఏమైనా వీటిలో ప్రకృతికి ఎంతో ప్రాధాన్యత. పువ్వులు, కుందేళ్లు, చిలుకలు, చెరుకుగడలు, ఇళ్లు, లక్ష్మీదేవి వంటి వాటికే ప్రాధాన్యత ఎక్కువ. 

పోటీలు... 
ఈ మాసంలో మహిళలు పోటీ పడి మరీ ముగ్గులను వేస్తారు. అనేక చోట్ల పోటీలను కూడా నిర్వహిస్తారు.మ్యాగజీన్స్‌, న్యూస్‌ పేపర్స్‌, ఇతర సంస్థలు పోటీలను నిర్వహించి బహుమతులను కూడా అందజేస్తారు. 

ఆరోగ్యం... 
ముగ్గు వేయడం కేవలం సంప్రదాయం మాత్రమే కాదు.. ఆరోగ్యానికి ఓ వరం కూడా. ఉదయాన్నే లేవడం... నీటిని తెచ్చి అందులో పేడ కలపడం... చల్లడం.. వంగి ముగ్గులు పెట్టడం ఇదంతా శరీరానికి చక్కటి వ్యాయామాన్ని ఇస్తుంది. ఇది చేతి వేళ్లు మొదలు పాదం వరకు అన్నిటిలో ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఉదయాన్నే లేవడం వల్ల రోజు మొత్తం ఆహ్లాదంగా వుంటుంది. అధిక బరువు, అనవసర కొవ్వు వంటివి శరీరంలో చేరకుండా కాపాడుతుంది. పైగా పేడలోని ఔషధ గుణాలు ఎన్నో రకాల క్రిములను నాశనం చేస్తాయి. ఆరోగ్యాన్నిస్తాయి. 


- హైమ సింగతల
(సూర్య దినపత్రిక January 11, 2011)

No comments:

Post a Comment