Search This Blog

Thursday 17 January 2013

సైన్సు జీనియస్!




ఏడేళ్ల సైన్స్ జీనియస్ పృథ్విక్. జంతు శాస్త్రానికి సంబంధించి రెండు పుస్తకాలను రాసేశాడు. ఇటీవలే విడుదలైన తన పుస్తకం 'వెన్ డైనోసార్స్ రోమ్డ్ ది ఎర్త్'తో సైన్స్ ప్రపంచంలో కొత్త ఆలోచనలను రేకెత్తిస్తున్నాడు. 


నాలుగో తరగతి విద్యార్థి తన తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, సీనియర్స్‌కు సైన్స్ పాఠాలు చెప్తున్నాడు. 'డైనోసార్లు మిలియన్ సంవత్సరాల కిత్రం భూమి మీద జీవించాయి. అందులో కొన్నిటిని మాత్రమే మనం కనుక్కోగలిగాం. ఇంకా కనుక్కోవాల్సినవి చాలానే వున్నాయి' అని చెబుతూ తన తరువాతి పుస్తకాన్ని రాసేందుకు సిద్ధమవుతున్నాడు ఏడేళ్ల పృధ్విక్. 165 ఐక్యూతో మేధావులను కూడా వెనక వరుసకి నెట్టేశాడు దుబాయ్‌లో బ్రిటీష్ సైన్స్ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్న ఈ భారతీయ చిన్నారి. అతని గది నిండా డైనోసార్ల బొమ్మలే. జంతువులపై పుస్తకాలు, సీడీలు, సినిమాలకు కొదవే వుండదు. ఎక్కడ చూసినా అవే. అలా అని వాటితో ఆడుకునేందుకు కాదు. పరిశోధనల కోసమే వాటిని సేకరించాడు. అందులో ఏ రకమైన డైనోసార్ బొమ్మ చూపించినా వాటి లక్షణాలు, పేరు, వివరాలు ఇలా అన్నీ ఠక్కున చెప్తేస్తాడు. భూమి పుట్టుకకు సంబంధించిన అంశాలు, జీవం ఏర్పడటానికి ముందు ప్రపంచం, డైనోసార్లు, సైన్స్, మ్యాథ్స్ ఇలా దేని గురించి అడిగినా చక్కగా వివరించేస్తాడు. ఇందుకు వాళ్ల అమ్మ ఇందిర, నాన్న అశోకే కారణం అని చెప్తున్నాడు. 
ఆరు నెలల వయసులోనే మాటలు నేర్చిన ఈ చిన్నోడు అప్పటి నుంచే భూమి గురించి వాళ్ల తాతను ప్రశ్నలు అడిగే వాడట. జంతువులు, వాటి పుట్టుక, మనిషి పుట్టుక ఇలా ప్రతి దాని గురించి ప్రశ్నించేవాడట. తెలిసినంత వరకు చెప్పేవారట. ఒకటిన్నర సంవత్సరం వయసు వచ్చేసరికి పృథ్విక్ సందేహాలు తీర్చేందుకు వాళ్ల తాతయ్య పూర్తి సమయాన్ని కేటాయించాల్సి వచ్చేదట! అలా మొదలైన ఆసక్తి భూమి పుట్టుక, శిలాజ శాస్త్రం, ఫిజిక్స్, జీవం ఆవిర్భావం వంటి అంశాలకు సంబంధించిన పుస్తకాల అధ్యయనానికి చేరుకుంది. తెలుసుకోవడమే కాదు సందేహాల నివృత్తి కోసం పరిశోధన, ప్రయోగాలు కూడా మొదలు పెట్టాడు. ఫలితంగానే 2010 బ్రిటీష్ సైన్స్ అసోసియేషన్ అందించే మెగాస్టార్ సైన్స్ క్రెస్ట్ అవార్డును అందుకున్నాడు. బ్రిటీష్ కౌన్సిల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా మారాడు. అన్నిటికన్నా పృథ్విక్‌కి అమితాసక్తి కలిగించేది డైనోసార్లు. వాటిపై పరిశోధనలు మొదలు పెట్టాడు. 
మూడవ తరగతిలో వుండగా పాఠశాలలో ఓ ప్రజెంటేషన్ కూడా ఇచ్చాడు. అది చూసి ఆశ్చర్యపోయిన వాళ్ల టీచర్ వీటన్నిటినీ ఓ పుస్తకంగా రాయమని ప్రోత్సహించింది. సంవత్సర కాలం పాటు అనేక పుస్తకాలను అధ్యయనం చేసి, సందేహాలను తొలగించుకుని ఇటీవలే వాటిపై పుస్తకాన్ని విడుదల చేశాడు. రెండవ పుస్తకం కూడా పూర్తి చేశాడు. కేవలం డైనోసార్ల గురించే కాదు లెక్కలు, సైన్స్ సబ్జెక్టుల్లో కూడా జీనియస్ అయిన ఈ అబ్బాయి పెద్దగైన తరువాత ఓ పెద్ద శిలాజ అధ్యయన శాస్త్రవేత్త కావాలని కలలుగంటున్నాడు. మరి తన కల నెరవేరాలని లిటిల్స్ తరపున పృిథ్విక్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం...

No comments:

Post a Comment