Search This Blog

Tuesday 15 January 2013

ఐస్ పండగ









పండుగ పేరు చెప్తే ఎంత హాయిగా అనిపిస్తుందో.. కానీ చైనాలో జరుపుకునే ఓ పండుగ పేరు చెప్తే చలేస్తుంది.. కాదు కాదు వణికిస్తుంది.. ఆ చిత్రమైన పండుగ కబుర్లేంటో తెలుసుకుందాం పదండి..!
ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా చైనాలోని హార్బిన్ అద్భుతంగా ముస్తాబయ్యింది. వేలాది మందికి స్వాగతం పలుకుతోంది. అక్కడి వెళ్లిన వారంతా అబ్బో ఎన్ని వింతలో అని ఆశ్చర్యంలో మునిగిపోతున్నారట. పగలు ధవళ వర్ణంలో, రాత్రికి రంగుల్లో కనిపించే ఈ వింతల కోసం ఎన్నో దేశాల నుండి కూడా అతిధులు వస్తున్నారని వినికిడి. ఇంతకీ అక్కడ జరుగుతోంది ఏంటంటే ఐస్ ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ అంటే చైనాలోని పిల్లలకు చాలా ఇష్టమట.
ఏముంటాయంటే..
పెద్ద పెద్ద కోటలు, రాజభవనాలు, ప్రముఖ పట్టణాలు ఇవన్నీ నమూనాలే లెండి. పైగా ఇవన్నీ చేసింది దేనితో అనుకుంటున్నారు.. మంచుతో. ఇంకా పెద్ద పెద్ద కళాకృతులు కూడా ప్రతి ఏడాదిలాగానే కొలువుతీరాయి. ఈ సారి మరో ప్రత్యేకత ఇందులోకి వచ్చి చేరింది. అదే ప్రపంచాన్ని ఊపేసిన స్టెప్స్ గ్యాంగనమ్. దీనికి కూడా ఈ సారి ఐస్ ఫెస్టివల్‌లో చోటు దక్కింది. 
పెద్ద వింత..
ప్రపంచంలో జరిగే ఐదు అతి పెద్ద ఐస్ ఫెస్టివల్‌లో ఈ హార్బిన్ ఫెస్టివల్ కూడా ఒకటి. కేవలం శిల్పాలు తయారు చేసి పండుగ చేసుకోవడం కాదు.. ప్రతి సారి గతేడాది కన్నా ఎక్కువ ఎత్తు లేదా పెద్దగా ఇక్కడ శిల్పాలను పోటీ పడి మరీ తయారు చేస్తారు. ఇతర దేశాల్లో నమోదైన మంచు శిల్పాల గిన్నీస్ రికార్డులు బద్దలు కొట్టేందుకు దీన్ని వేదికగా చేసుకుంటారు.
ఐస్ కరిగిపోదా...
ఎందుకు కరిగిపోదు.. కానీ అక్కడ మనకున్నంత ఉష్ణోగ్రత వుండదు. జనవరి మాసంలో వారికి -17 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రత వుంటుంది. ఈ ఉష్ణోగ్రతకు మంచు కరగడం పక్కన పెట్టండి.. నదులు, సముద్రాలు కూడా గడ్డకట్టుకుని వుంటాయి. చైనా వాళ్లు అక్కడ కూడా ఐస్ స్కేటింగ్, డాగ్ రేసింగ్ వంటి క్రీడలు కొనసాగిస్తారు. కాబట్టి వాతావరణం మారే వరకు ఈ పండుగకు ఏ సమస్యా లేదు. ఉష్ణోగ్రతలు మారే కొద్దీ శిల్పాలు వాటంతట అవే కరిగిపోతాయి. అప్పటి వరకు ఎంచక్కా ఎంజాయ్ చేసేయోచ్చు.

No comments:

Post a Comment