Search This Blog

Friday 2 May 2014

భలే దుంప..!

b-kathaఅనగనగా కొంత కాలం క్రితం ఒక అడవిలో ఒక తాత వుండేవాడు. ఆయన ప్రతి సంవత్సరం దుంపలను పండించేవాడు. అవి ఎంతో లావుగా చాలా రుచిగా వుండేవి. ఎప్పటిలాగానే ఆ ఏడాది కూడా దుంపల విత్తనాలను చల్లి వాటిని జాగ్రత్తగా పెంచడం ప్రారంభించాడు. ఆ ఏడాది మాత్రం ముసలాయన చాలా సంతోషపడ్డాడు. ఎందుకంటే ఎప్పుడూ లేనిది ఓ ఈ సారి మాత్రం ఓ పెద్ద దుంప తయారైంది. దాన్ని ఇంకా పెంచాలని ఆ తాత అలాగే వదిలేశాడు. ఇంకా పెద్దగా అయ్యే వరకు వుంచేశాడు. ఆ దుంప రోజు రోజుకీ ఇంకా ఇంకా పెద్దగా పెరిగి పెద్దదయిపోతోంది. అది ఎంత పెద్దగా పెరిగిపోయిందంటే దాన్ని చూసి అందరూ చూసి ఆశ్చర్యపోవడం ప్రారంభించారు. కొంత కాలం తరువాత ఆ దుంప పెరగడం ఆగిపోయింది. అప్పుడు తాత ఆ దుంపను తీయాలని నిర్ణయించుకున్నాడు. ఆ చెట్టు ఆకులను పట్టుకుని లాగడం ప్రారంభించాడు. ఎంత సేపు లాగినా అది కొంచెం కూడా కదలేదు. అలా పాపం లాగుతూనే వున్నాడు. ఊహూ.. ఆ దుంప మాత్రం కదల్లేదు.

ఇక విసుగొచ్చిన తాత వాళ్ళ అవ్వను పిలిచి కాస్త సాయం చేయమని అడిగాడు. తాత ఆ చెట్టును పట్టుకుని లాగుతుంటే అవ్వ ఆయన్ను పట్టుకుని లాగడం మొదలుపెట్టింది. ఇద్దరూ కలిసి అలా ఎంత సేపు లాగినా కూడా అది రాలేదు. కొంచెం కూడా కదల్లేదు. ఇక అవ్వ కూడా చేసేదేమీ లేక తన మనవరాలిని సాయం చేసేందుకు పిలి చింది. మనవరాలు పరిగె త్తు కుంటూ వచ్చింది. వాళ్ల అవ్వను పట్టుకుని లాగడం మొదలు పెట్టింది. అవ్వేమో తాతను పట్టుకుని లాగుతోంది. తాతేమో ఆకుల్ని పట్టుకుని లాగుతూనే వున్నాయి. అయినా కూడా ఆ దుంప బయటికి రానే లేదు.

మనవరాలేమో తన పెంపుడు కుక్కను సాయం చేయమని పిలిచింది. కుక్క మనవరాలిని, మనవరాలు అవ్వని, అవ్వ తాతని, తాతేమో దుంప ఆకుల్ని పట్టుకుని లాగడం మొదలు పెట్టారు. ఊహూఁ అయినా కూడా దుంప బయటికి రాలేదు. ఎంత సేపు ప్రయత్నించినా కొంచెం కూడా కదల్లేదు.

వెంటనే కుక్క తన స్నేహితురాలు పిల్లిని సాయం చేయమని బతిమాలింది. తన స్నేహితుడి బాధ చూడలేక పిల్లి కూడా వచ్చి వాళ్ళకు సాయం చేయడానికి కుక్కను పట్టుకుని వెనక్కు లాగడం ప్రారంభించింది. ఇలా ఒకర్ని ఒకరు పట్టుకుని ఎంత ప్రయత్నించినా దుంప మాత్రం బయటికి రాలేదు.
చివరికి పిల్లికి కూడా విసుగొచ్చింది. వెంటనే ఆలోచించి తన స్నేహితురాలు ఎలుకను సాయం కోరింది. ఎలుక కూడా పరిగెడుతూ వచ్చేసింది. ఎలుక పిల్లి చేయి పట్టుకుని లాగింది. పిల్లి కుక్కను పట్టుకుని లాగింది. కుక్క మనవరాలిని, మనవరాలు అవ్వని పట్టుకుని గట్టిగా లాగాయి. అవ్వ తాతను గట్టిగా లాగింది. తాత చెట్టు ఆకులను పట్టుకుని చాలా కష్టపడి లాగి లాగి... చివరికి చాలా సేపటి తరువాత దుంప బయటికి వచ్చేసింది. అంతా ఒకరి మీద ఒకరు పడిపోయారు. తరువాత అందరూ కలిసి దుంపను పంచుకున్నారు. 
-ధరణి(హైమ సింగతల)
budugu, surya telugu daily, March 6, 2011

No comments:

Post a Comment