Search This Blog

Sunday, 10 August 2014

ముంగిళ్ల మెరిసే రంగుల సందేశాలు...

రోజూ వేసే రంగు రంగుల ముగ్గులను చూస్తేనే తెలుస్తుంది... ఇది ధనుర్మాసమని, వచ్చేది సంక్రాంతి పండుగని... ఈ పండుకు నెల రోజుల ముందు నుండే సందడి మొదలవుతుంది. మాసం మొత్తం పండుగ వాతావరణాన్ని తలపింపజేస్తుంది. ప్రతీ గడపా రంగు రంగుల ముగ్గులతో ముస్తాబవుతుంది. భారతీయ సంప్రదాయంగా ఎన్నో వందల ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న ముగ్గుల సంప్రదాయం కేవలం అలంకరణ కోసమే కాదు.. ఆరోగ్యం... అందం.. ఆనందం కోసం కూడా.. అటువంటి ఈ ముగ్గుల కథేంటో తెలుసుకుందాం..

rangoli1సంక్రాంతి పండుగ అంటేనే మిగిలిన వాటికి ఎంతో ప్రత్యే కమైంది. పల్లెటూళ్లలో ధాన్యం ఇళ్లకు చేరే సమయం.. అన్ని గడపలూ ఆనందంతో నిండిపోతాయి..పైగా సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశించే పవిత్రమైన ధనుర్మాసం.. మిగిలిన పండుగలన్నీ చాంద్రమానాన్ని అనుసరించి చేసుకున్నా ఈ పండుగకు మాత్రం సౌరమానాన్ని అనుసరిస్తారు. అందుకే ఈ పండుగకు ఎంతో ప్రత్యేకత వుంటుంది.

రంగోలి...
రంగోలి అనేది ఉత్తర భారతదేశంలో ముగ్గుకు మరో పేరు. ముగ్గు, రంగవళ్లి అనేది మన తెలుగు భాషలోని పేరు. బెంగాలీ లో అల్పానా, తమిళ్‌లో కోలమ్‌, అని ఎలా పిలిస్తారు. పేరు ఏదై నా వ్యక్తీకరణ సృజనాత్మకమే. 

గ్రామీణ ప్రాంతాల్లో... 
గతంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లను ఎర్రమన్నుతో కట్టుకునే వారు. అలా కట్టుకున్న ఇంటికి మట్టిపేడను కలిపి అలికేవారు. దీని వల్ల దుమ్ముధూళి వంటివి ఇంట్లోకి రాకుండా అణగి పోయే వి. పురుగులు వంటివి రాకుండా బియ్యపు పిండితో ముగ్గులు పెట్టేవారు. వీటి వల్ల అవి ఆ బియ్యం పిండిని ఆహారంగా తీసుకు ని ఇంట్లోకి రాకుండా పోయేవట. 

దక్షిణ భారతదేశంలో.. 
rangoli3దక్షిణ భారతదేశంలోని పల్లెటూళ్లలో ఇప్పటికీ పేడ నీటిని చల్లి బియ్యపు పిండితో ముగ్గులు పెట్టుకునేవారున్నారు. ఇప్పుడు చాలావరకు బియ్యపు పిండికి బదులు ముగ్గురాళ్ల పొడి దొరుకుతుంది. దీని ద్వారా వేసు కుంటున్నారు. 

స్వాగత అలంకారం... 
ధనుర్మాసం విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది. ఈ మాసంలో విష్ణుమూర్తి భూమి మీదకు వస్తా రని నమ్ముతారు. ఈ మాసంలోనే స్వర్గపు ద్వారాలు కూడా తెరు చుకుంటాయనేది మన పెద్దల నమ్మకం.అందుకే మహిళలంతా ఉదయాన్నే తొందరగా లేచి ఇంటి ముందు శుభ్రం చేస్తారు. పేడను నీటిలో కలిపి చల్లుతారు. ఇంటి ముందు అందమైన రంగ వల్లులను తీర్చిదిద్దుతారు. ఈ ముగ్గులను వేసుకునేప్పుడు విష్ణునామస్మరణ చేస్తూ పూర్తి చేస్తారు. 

ముగ్గులలో గొబ్బిళ్లు...
ఈ నెల మొత్తం ఆవు పేడను ముద్దలుగా చేసి ముగ్గుల మధ్యలో పెడతారు. వీటిని గొబ్బెమ్మలు అంటారు. ఇది గౌరీమాతను పూజించడంలో ఓ భాగంగా వస్తోంది. ఈ గొబ్బెమ్మళ్లను పసుపు కుంకుమలతో అలంకరించి మధ్యలో గుమ్మడి లేదా బంతి పూల ను పెడతారు. పెద్దదాన్ని ముగ్గు మధ్యలో పెట్టి చిన్న చిన్న వాటిని వాటి చుట్టూ పెడతారు. 

కోరికలు తీర్చమంటూ...
చిన్న చిన్న పిల్లలు, ెపెళ్ళికాని యువతులు మంచి భర్త రావాలని ఈ ముగ్గుల చుట్టూ పాటలు పాడుతూ గొబ్బి తడతారు. పెళ్లైన మహిళలు తమ దాంపత్య జీవితం బాగా గడవాలని కోరుతూ ఈ వేడుకను చేసుకుంటారు. 

వేడుకల అనంతరం..
rangoliరోజూ ముగ్గులలో పెట్టే గొబ్బిళ్లను తీసి ఎండలో ఎండబెడతారు.వీటిని పండుగ రోజు సూర్యభగవానుడికి నైవేద్యంగా పెట్టే తీపి అన్నం(పాయసం)వండేందుకు పిడకలుగా వుపయోగిస్తారు. ఇప్పటికీ పల్లెటూళ్లలో వీటినే వంట చేసుకునేందుకు వుపయోగి స్తారు. ఇవి ప్రకృతికి ఎంతో మేలు చేస్తాయి కూడా. 

రెండు రకాలు..
ఈ ముగ్గులలోనూ రెండు రకాలు వున్నాయి.. అవి ఒకటి చుక్క లు పెట్టి వేసేవి. మరొకటి డిజైన్స్‌..వీటికి ఏ చుక్కలూ అవసరం లేదు. సృజనాత్మకంగా తమ మనసులోని రూపాలను వేయడం అన్నమాట. ఏది ఏమైనా వీటిలో ప్రకృతికి ఎంతో ప్రాధాన్యత. పువ్వులు, కుందేళ్లు, చిలుకలు, చెరుకుగడలు, ఇళ్లు, లక్ష్మీదేవి వంటి వాటికే ప్రాధాన్యత ఎక్కువ. 

పోటీలు... 
ఈ మాసంలో మహిళలు పోటీ పడి మరీ ముగ్గులను వేస్తారు. అనేక చోట్ల పోటీలను కూడా నిర్వహిస్తారు.మ్యాగజీన్స్‌, న్యూస్‌ పేపర్స్‌, ఇతర సంస్థలు పోటీలను నిర్వహించి బహుమతులను కూడా అందజేస్తారు. 

ఆరోగ్యం... 
ముగ్గు వేయడం కేవలం సంప్రదాయం మాత్రమే కాదు.. ఆరోగ్యానికి ఓ వరం కూడా. ఉదయాన్నే లేవడం... నీటిని తెచ్చి అందులో పేడ కలపడం... చల్లడం.. వంగి ముగ్గులు పెట్టడం ఇదంతా శరీరానికి చక్కటి వ్యాయామాన్ని ఇస్తుంది. ఇది చేతి వేళ్లు మొదలు పాదం వరకు అన్నిటిలో ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఉదయాన్నే లేవడం వల్ల రోజు మొత్తం ఆహ్లాదంగా వుంటుంది. అధిక బరువు, అనవసర కొవ్వు వంటివి శరీరంలో చేరకుండా కాపాడుతుంది. పైగా పేడలోని ఔషధ గుణాలు ఎన్నో రకాల క్రిములను నాశనం చేస్తాయి. ఆరోగ్యాన్నిస్తాయి. 


- హైమ సింగతల
(సూర్య దినపత్రిక January 11, 2011)

పండుగ కాదిది పోరాటం

హక్కుల సాధన కోసం చేస్తున్న పోరాటాలు ఓ వైపు.. పురుషాహంకార ధోరణులతో నలిగిపోతూ మరోవైపు.. అన్ని రంగాల్లో సమాన బాధ్యతలు నిర్వహిస్తున్నా సమాన విలువలు మాత్రం కరువు...వివక్షతో కూడిన ఆచారాలు, పద్ధతులు, కట్టుబాట్లు చుట్టూ ముళ్ల కంచెల్లా మారి అడ్డుకుంటున్నా ప్రగతి బాటలో పయనించేందుకు వేస్తున్న అడుగులు.. ప్రపంచం మొత్తం 101వ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నా రోజు రోజుకు ఎదురవుతున్న కొత్త సవాళ్లను ఎదుర్కోవడంలో తలమునకలైపోయింది నేటి మహిళ. అటువంటి మహిళ ఎదుర్కొంటున్న, ఎదురీదుతోన్న సమస్యలపై, వారు సాధించిన విజయాలపై ‘ధీర’ అందిస్తున్న ప్రత్యేక కథనం..

వేడుకల సమయం కాదు..
womenఈ మహిళాదినోత్సవానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. వందేళ్లు దాటి నూట ఒకటవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న చరిత్రలో ఎంతమంది మహిళలు ఎన్ని ఉన్నత పదవులు సాధించారనేదీ గుర్తించాలి.వాస్తవానికి అన్ని ఉద్యమాల్లో మహిళల పాత్ర సమానంగా ఉన్నప్పటికీ రావలసిన గుర్తింపు రాలేదు. రాలేదు కాదు రాకుండా చేశారు. స్వాతంత్ర పోరాటం మొదలు ఇటీ వలి అన్ని ఉద్యమాల్లోనూ మహిళలూ సగం అన్న విషయం మరుగున పడేశారు. అందుకే చరిత్రను తిరిగి రాసుకోవాలి. స్ర్తీల హక్కుల కోసం, వారిని అక్షరాస్యులుగా చేయడం కోసం ఉద్యమించిన సావిత్రిబాయి పూలేను గుర్తించిన వారు లేరు. ఇలా చెప్పుకుంటు పోతే ఇంకా అనేక సంవత్సరాలు వెనకకు మహిళలు వెళ్లిపోయారు.

అందుకే వనిత గొంతు ఇంకా విన పడాల్సి ఉంది. నేడు మహిళాదినోత్సవం అంటే అంటే పండగ కాదు.ఇది పోరాటదినం అనే విషయాన్ని గుర్తించాలి. చరిత్ర నిర్మాతలుగా నిరూపించుకోవాలి. అప్పుడే నిజమైన మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోగలం. ఉన్న చట్టాల్ని సరిగ్గా వినియోగించుకోలేనపుడు కొత్త చట్టాలు ఎన్ని వచ్చిన వ్యర్థ మే. చట్టాలు తెలియాలంటే చదువు పెరగాలి. మహిళలు తల్లి, కూతురు, భార్యగానే కాదు మగవారితో సమానంగా తాము సమాజంలో పౌరులుగా బాధ్యత వహించాలి.

నిలువెల్లా దాడుల గాయాలతో... 
ప్రేమిస్తున్నామంటూ ప్రాణాలు తీస్తున్నా నమ్మి వారికి బలి అవుతున్న అమాయకురాళ్లు ఎందరో నేరాల సంఖ్యకు సాక్షు లుగా నిలిచారు. గతేడాది మన రాష్ట్రంలో ఆడవారిపై నేరాల కు సంబంధించి నమోదైన కేసుల సంఖ్య 1,68,191. దాడు లకు సంబంధించి 21,436. వీటిలో 1,147 అత్యాచారాలు. ఇక మిగి లినవి జిల్లాల వారీగా నమోద య్యాయి. హైదరా బాద్‌, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో మహిళలపై దాడుల కేసులు 1,622. ప్రతి గంటకు కనీసం ముగ్గురు మహిళలు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు రాష్ట్ర నేర నమోదు విభాగం స్పష్టం చేస్తోంది. 

handప్రతి రెండు నిమిషాలకు ప్రపంచం మొత్తం మీద ఒక మహిళ అత్యాచారానికి గురి అవుతోంది. దీనిని బట్టే ఆడవారిపై పెరిగిపోతున్న నేరాలు అంచనా వేసుకోవచ్చు.గతంతో పోల్చితే ఈ రేటు మహిళలపై దాడుల కేసులు గతం తో 7 శాతం పెరిగాయి. ఇది దిగ్భ్రాంతికి గురిచేస్తున్న అంశ మే అయినా వాస్తవం. గృహహింస, కట్నాల కేసులు ఇవన్నీ సర్వసాధారణమైన అంశాలు. చట్టాలు మాత్రం తీసుకొచ్చేం దుకు ప్రయత్నాలు చేయగలం. కానీ వాటినుండి తప్పించు కునేందుకు ఎదుటి వారు చేసే ప్రయత్నాలను కూడా పసిగట్టి అడ్డుకట్ట వేసే స్థాయికి మాత్రం మహిళలు చేరుకోలేదు. 

చట్టసభల్లో రిజర్వేషన్‌ కోసం.. 
దేశంలో ఒక రాష్టప్రతి, ఒక ముఖ్యమంత్రి, పార్లమెం ట్‌ స్పీకర్‌, నగర మేయర్‌ ఇలా ఎన్ని స్థానాల్లో మహి ళలు వున్నా వీరిని చూసి సంబర పడేందుకు లేదు. తల్లులుగా, భార్యలుగా కుటుంబాలను తీర్చిదిద్దే వారు దేశ దశ, దిశను నిర్దేశించడంలో బాధ్యతా యు తంగా ఉండగలరు. క్షేత్ర స్థాయిలో స్థానిక సంస్థలలో 33శాతం రిజర్వేషన్‌ అమలవుతున్నప్పటికీ అధికారం పురుషుల చేతిలో ఉన్నదన్న వాదన ఉంది. అయినప్పటికీ రాజకీయ సాధికారతను సాధించడం లో తొలఇడుగులుగా ఇవి. ఎందుకంటే ప్రజల చేత ఎన్నికైంది మహిళలే కానీ వారి భర్తలు కాదు. 

women1రాష్ట్రం లో స్వయం సహాయక బృందాలు ఆర్థికంగా సాధికారతను సాధించడమే కాక సామాజిక చైతన్యాన్ని పెంచే కార్యక్రమాలను సైతం చేపడుతుండడం ఒక గొప్ప విజయంగా భావించాలి. పార్లమెంటు, అసెంబ్లీలలో మహిళలకు 33శాతం రిజర్వేషన్‌ ప్రతిపాదన దశాబ్దమున్నరగా నానుతోంది. కర్రవిరగదు, పాము చావదు చందంగా రాజకీయ పార్టీలన్నీ బిల్లును సమర్ధిస్తున్నట్టుగా మాటాడుతూనే దానిని ఆమోదం కాకుండా అడ్డు పడుతున్నాయి.1996లో యునెటెడ్‌ ఫ్రంట్‌ ప్రభు త్వంలో హెచ్‌.డి. దేవె గౌడ ప్రధానిగా ఉన్న సమ యంలో ఈ బిల్లును తొలు త ప్రతిపా దించారు. ఐ.కె. గుజ్రాల్‌ ప్రస్తుత రూపంలో ఉన్న ఈ బిల్లును ప్రవేశపె ట్టారు. 

ఒకవేళ ఈ బిల్లు చట్టమైతే 543 మంది సభ్యులున్న పార్లమెంటులో దాదాపు 181 మంది మహిళలు తప్పనిసరిగా సభ్యులుగా ఉంటారు. తరువాత అనేకసార్లు దీనిని సభలో ప్రవేశపెట్టినప్పటికీ, మహిళా జనాభాలో సగభాగానికి పైగా ఉన్న వెనుకబడిన తరగతుల మహిళలకు ఉపకోటా కల్పిం చకుండా దీనిని ఆమోదించడానికి వీలులేదని కొన్ని పార్టీలు పట్టబట్టడంతో ఈ బిల్లు ఆమోదం పొంద లేదు. ఎక్కువ మం ది మహిళలు చట్ట సభలలో ఉంటే, అంటే విధాన నిర్ణేతలు గా ఉంటే దేశం దశ, దిశ మారిపోతాయనడంలో సందేమం లే దు. అభివృద్ధితో సమానంగా మహిళలు రాజ కీయ అవకా శాలు అందిపుచ్చుకోలేక పోతున్నారన్నది వాస్తవం. మహిళా బిల్లు ఆ లోటును పూర్తి చేస్తుందని మహిళా లోకంతో పాటు ప్రజా స్వామ్య శక్తులు కూడా ఆశిస్తున్నాయి. 

విదేశాలలో సాధిస్తున్న విజయాలెన్నో...
మనదేశ మహిళలు ఎక్కడున్నా ముందుకు వెళ్ళగలరు అని నిరూపించుకుంటున్నారు. వారి విజయాల వెనుక ఈ దేశపు మట్టి సువాసన ఉందని వారు సగర్వంగా చెప్పుకుంటు న్నారు. వారిలో ఆసియా మేటి మహిళగా మోనిక పేరు గడించిం ది. ప్రజాసంబంధాల విభాగంలో మోనిక అందించిన సేవలకు ఉమెన్‌ ఆఫ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డు దక్కింది. సౌత్‌కరోలినా రా ష్ట్ర గవర్నర్‌ ఎన్నికల్లో భారతీయ మహిళ నిక్కీ హెలీ విదేశాల్లో అత్యున్నత పదవి అయిన గవర్నర్‌ పదవిని చేజిక్కించుకుని విజయబావుటా ఎగురవేసింది. బాబీ జిందాల్‌ తరువాత ఆ పదవిని అందుకున్న రెండవ ఎన్నారైగా, తొలి మహిళగా చరిత్రలో నిలిచిపోయింది. 

SR_Savitribaభారత సంతతి మహిళా గీతా గోపినాథ్‌ ప్రఖ్యాత హార్వర్డ్‌ యూనివర్సిటీకి ప్రొఫెసర్‌గా నియ మితులై ఈ స్థానాన్ని పొందిన తొలి భారతీయ వనితగా వార్త ల్లో కెక్కారు. ప్రపంచ ప్రసిద్ధ విశ్వవిద్యాలయం అయిన అమె రికాలోని హార్వర్డ్‌ యూనివర్సిటీలో భారతీయ సంతతి మహి ళకు తొలిసారిగా ప్రొఫెసర్‌ హోదా లభించింది. బ్రిటన్‌ హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో తొలిసారిగా ఇద్దరు ప్రవాస భారతీయ మహిళలకు ఆ దేశ హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లోకి ప్రవేశం లభించింది. బ్రిటన్‌లోని ప్రవాస భారతీయ మైనారిటీలకు నేతృత్వం వహి స్తున్న ఈ ఇద్దరు మహిళలు ఆ దేశ సార్వత్రిక ఎన్నికలలో రెండు నియోజకవర్గాలలో విజయం సాధించి హౌస్‌ ఆఫ్‌ కా మన్స్‌లో అడుగుపెట్టారు. 

ప్రవాస భారతీయ మహిళ ప్రీతి పటేల్‌ కన్జర్వేటివ్‌ పార్టీ తరుఫున బ్రిటన్‌ హౌజ్‌ ఆఫ్‌ కామన్స్‌లో తొలిసారిగా అడుగుపెట్టారు. గే లేబర్‌పార్టీ అభ్యర్థి ఇండి యన్‌ ఆరిజన్‌ లేబర్‌ పార్టీ ఎంపీ కీత్‌వాజ్‌‌‌ సోదరి వలేరీ వాజ్‌ కూడా హౌజ్‌ ఆఫ్‌ కామన్స్‌కు ఎంపికయ్యారు. ప్రముఖ భార తీ య అమెరికన్‌, ఉద్యమకారిణి కమలా హ్యారిస్‌ కాలి ఫోర్ని యా అటార్నీ జనరల్‌ పదవికి డెమోక్రటిక్‌ పార్టీ నామినేషన్‌ గెలుచుకున్నారు.నామినేషన్‌ కోసం జరిగిన ప్రాథ మిక ఎన్ని కల్లో ఫేస్‌బుక్‌ ఎగ్జిక్యూటివ్‌ క్రిస్‌ కెల్లీ సహా ఆరు గురిని కమల ఓడించారు. అమెరికాలో అత్యంత ప్రజాదరణ పొందిన స్పె ల్లింగ్‌ బీ కాంపిటేషన్‌లో భారతీయ సంతతి బాలిక 83వ జా తీయ స్పెల్లింగ్‌బీ అనామిక విజయం సాధించింది. ఇలా చెప్పుకుంటూ పోతే విదేశాలలో విజయాలు సాధిస్తున్న వారు ఎందరో మహిళలు. 

దేశానికి రక్షణగా....
ప్రస్తుతం అమ్మాయిలు ఏ రంగంలోనూ వెనకడుగు వేయ డం లేదు. నింగి, నేల మాదేనంటూ ముందుకు దూసుకుపో తున్నారు. ఉద్యోగానికి, లింగభేదానికి ఉన్న రేఖను చెరిపేస్తు న్నారు. కార్పొరేట్‌ ఆఫీస్‌లో అధిక ఒత్తిడితో చేయగలిగే ఉన్న త పదవులైనా, శారీరంగా కష్టమైనా దేశ సరిహద్దు రక్షణ సైనికులుగానైనా సై అంటున్నారు. మగవారికి ధీటుగా చేయ గలమని నిరూపిస్తున్నారు. కేవలం వైద్య, సేవా, విద్య వంటి రంగాల్లో మాత్రమే మిలిటరీల్లో సేవలందించిన వారు పా రామిలటరీ ఇండో- టిబిటెన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ)గా శిక్ష ణపొంది దేశానికి సేవ చేయడానికి ఎంపికయ్యారు. 

వీరిలో చాలామంది చిన్న పట్టణాలకు చెందినవారు. చిన్న పట్టణాల్లో పుట్టినా వారి కల మాత్రం చిన్నది కాదు. ఆ స్వప్నాన్ని సాకా రం చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడ్డారు. చట్టు పక్కల ప్రజలు మీకెందుకు ఆ పనులు వేరే ఉద్యోగంలో చేరవచ్చుగా అని నిరుత్సాహ పరిచినా తమ లక్ష్యాన్ని వదులుకోలేదు. ఇం డో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ)గా శిక్షణ పొందారు. వీరు అంతర్జాతీయ సరిహద్దుల్లో, ఇతర క్లిష్టతరమైన ప్రాంతా ల్లో సేవలు అందిస్తున్నారు. వీరు నాతూ లా పాస్‌ అనే ప్రాం తం వద్ద భద్రతను పాటించాల్సి ఉంటుంది. భారత్‌, చైనాకు మధ్యగల క్లిష్టపరమైన ప్రాంతం అది. అయినా సరే దేశానికి రక్షణగా నిలిచేందుకు వారు సిద్ధమయ్యారు. ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూ పోతూ వారి ధైర్య సాహసాలు అనంతం.సుఖో య్‌లో పర్యటించిన అత్యంత ఎక్కువ వయసు కలిగిన తొలి మహిళ మన రాష్టప్రతి ప్రతిభాపాటిల్‌. 


- హైమ సింగతల
(సూర్య దినపత్రిక ధీరలో March 8, 2011న వచ్చిన నా ఆర్టికల్)

Wednesday, 6 August 2014

అమ్మాయిల స్ట్రీట్‌ షాపింగ్‌

ఫ్యాషన్‌ అంటే అమ్మాయిలు.. తల నుండి కాలి వరకు వుపయోగించే ప్రతీదీ ఫ్యాషనబుల్‌గా వుండాల్సిందే వారికి... ఇక నగరాల్లోని కాలేజీలలో చదివే అమ్మాయిల ఫ్యాషన్స్‌ చూస్తే మతులు పోవడం ఖాయం..కొత్తగా మార్కెట్‌లోకి ఏది వచ్చినా వారి వార్డ్‌ రోబ్‌లో చేరాల్సిందే. అలా అని వారు డబ్బంతా ఫ్యాషన్‌ పేరుతో తగలబెడుతున్నారు అనుకుంటే పొరపాటే. వారు వుపయోగించేవి ఖరీదైనవిలా కనిపించేవే కానీ నిజానికి అంత ఖరీదైనవేం కావు. కాకపోతే వారు చేసే ఎంపికలోనే వుంటుంది అంతా.. నగరంలో పెద్దపెద్ద షాపుల పక్కసందుల్లో, వీధి పక్కన కుప్పపోసి అమ్ముతున్న వస్తువులే అవి. నమ్మశక్యం కాకపోయినా ఇది నిజం.. హైటెక్‌ నగరాల్లో తోటి వారితో సమానంగా ఫ్యాషనబుల్‌గా ఉండాలంటే ఇదొక మార్గం వారికి.. పాకెట్‌ మనీ కాస్త తగ్గినా పర్వాలేదు.. ఫ్యాషన్‌ మాత్రం ఫాలో అయిపోతాం అంటున్నారు... వారు చెబుతున్న ఆఫ్యాషన్‌ కబుర్లు...

ఫ్యాషన్‌కి కేరాఫ్‌ అడ్రస్‌లు...
shoping3కోటి, బడీ చౌడీ, సికింద్రాబాద్‌, చార్మినార్‌, దిల్‌షుక్‌నగర్‌, అమీర్‌ పేట్‌, వీధులన్నీ ఎప్పుడూ షాపింగ్‌ చేసే వారితో కిటకిటలాడుతుం టాయి. సెలవు దినాలు, పండుగలు వంటివేవీ అక్కర్లేదు. ఎప్పుడూ కిక్కిరిసి పోయి వుంటాయి. డిజైనర్‌ టాప్స్‌, జీన్స్‌ నుండి..ఆక ర్షణీయమైన వన్‌గ్రామ్‌ నగలు, బ్యాగులు, బెల్టులు, చెప్పులు ఒక టేమిటి చెప్పుకుంటూ పోతే ఇక్కడ దొరకని వస్తువులంటూ వుండ వు. పైగా ధరలు కూడా ఎంతో అందుబాటులోనే వుంటాయి. 

స్టైల్‌ విషయంలో నో రాజీ.. 
అట్టహాసంగా ఉండే మాల్స్‌ను వదిలేసి ఊరి వీధుల్లో కొనుగోళ్ళు చేస్తున్నారంటే అమ్మాయిలు స్టయిల్‌ విషయంలో రాజీపడుతున్నా రని భావించడానికి లేదు. అన్నిటినీ ఆలోచించే వారు ప్రతీదీ ఎం పిక చేసుకుంటున్నారు. ‘నాక్కావలసిన బట్టలు ఎన్నుకునేప్పుడు నే ను చాలా జాగ్రత్త తీసుకుంటాను. నాకు కావలసిన ఫ్యాషనబుల్‌ బ ట్టలు ఇక్కడ చౌకగా దొరుకుతాయి. ఈ కాలపు ట్రెండ్‌ని దృష్టిలో పెట్టుకునే కొంటాను. పైగా ఎప్పటికప్పుడు ఫ్యాషన్‌ మారుతోంది. వాటితోపాటు మనం మారాలంటే కాస్త ఖర్చుతో కూడుకున్న పనే.. అందుకే ఈ మార్గం.. హెయిర్‌ పిన్‌ నుండి చెప్పుల వరకూ అన్నీ ఇక్కడ సరసమైన ధరల్లో దొరుకుతున్నాయి. బడ్జెట్‌ కూడా లోటు వుండదు.’ అంటోంది అక్కడ కొనుగోలు చేయడానికి వచ్చిన కాల్‌సెంటర్‌ ఉద్యోగి రాధిక. 

అన్నీ అతి తక్కువకే...
‘అత్యాధునిక డిజైన్ల వస్త్రాలు, కాస్మొటిక్స్‌. టాప్స్‌ గానీ, టి- షర్ట్స్‌గానీ, జీన్స్‌ మా దగ్గర అన్నీ వున్నాయి’ అంటున్నారు హ్యాకర్స్‌. బండ్ల మీద, ఫుట్‌పాత్‌లపైన, లేదా బ్యాగులు చేతిలో వేసుకుని వీధుల్లో తిరిగి అమ్మేవారి దగ్గర నిజంగానే ఎన్నో కొత్త వెరైటీలు దొరుకుతున్నాయి అంటున్నారు అమ్మాయిలు కూడా. ‘నిజానికి, నేటి అత్యుత్తమ ఫ్యాషన్‌ దుస్తులు చౌకగా దొరుకుతా. కనుకనే మా దగ్గరికి బట్టలుకొనడానికి ఎక్కువగా యువతులు వస్తారు’ అంటున్నారు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ దగ్గరలోని ఓ బండిపై అమ్మాయిల వస్త్రాలను విక్రయించే రాజేష్‌. అతని దగ్గర అన్ని రకాల టాప్స్‌, పటియాలా..లెగ్గిన్స్‌ తక్కువ ధరలకు దొరుకు తాయని కూడా చెబుతున్నాడు. 

డబ్బు తక్కువగా ఉందా... 
shoping1‘కొద్ది నెలల క్రితం వరకు బట్టలు కొనాల్సివస్తే నేను పెద్ద షాపులకే వెళ్ళేదాన్ని. కానీ మా ఫ్రెండ్స్‌ ఎక్కువ ఖర్చుపెట్టకపోయినా నాకన్నా చాలా ఫ్యాషనబుల్‌ డ్రస్సులు వేసుకోవడం చూశాను. అడిగితే అది ఫ్లాట్‌ఫాం మీద కొన్నవని చెప్పారు. నమ్మలేకపోయా..నేను వెళ్ళి చూసిన తరువాతే తెలిసింది. ఇవి ఎక్కువ కాలం మన్నక పోయినా సరే ట్రెండీగా బాగున్నాయి. పాకెట్‌ మనీలో వచ్చేస్తాయి. అందుకే ఇక్కడ వీధుల్లో అమ్మే బట్టలు కొనుక్కుంటున్నాను’ అం టోంది కాలేజ్‌ విద్యార్థిని గాయిత్రి.

‘నాకు నచ్చిన బట్టలు అలంకరణ సామగ్రి కొనడానికి కొద్దిపాటి డ బె్బైనా ఆదా చేయాలి. వాటిని మిగిలిన వాటికి వుపయోగించాలి. పై గా ఎక్కువ ఖర్చు పెట్టి కొన్నా మాటి మాటికీ వేసుకోలేం. అందుకే తక్కువ ఖర్చుతో కొన్నవి అయితే వాటి గురించి పెద్దగా బాధపడా ల్సిన అవసరం కూడా లేదు. కనుక చౌకగా దొరికే నగర వీధుల్లో బట్టలు కొంటున్నా’నంటోంది మరో కాలేజీ విద్యార్థిని నందిత.

ఆలోచనతో అవసరాలు... 
shopingసాధారణంగా ఎంత ఖరీదు పెట్టి కొన్న వస్తువులైనా సరే ఎప్పుడూ వేసుకుంటూ వుండలేం. ఒక వేళ బోర్‌ కొడితే అంత ఖరీదుపెట్టి కొన్నవి వదిలేయాలన్నా మన సు ఒప్పదు. అందుకే నేటి తరం యువతులు వీటిపట్ల మ క్కువచూపు తున్నారు. రోజూ వారి అవసరాల కోసం ఎక్కువ గా కోటి, సికింద్రాబాద్‌, అమీర్‌పేట ప్రాంతాల్లో రోడ్ల ప క్కన కుప్పలుగా పోసి వుండే చెప్పులు, బ్యాగులను కొను గోలు చేస్తున్నారు. ‘ఏదైనా పా ర్టీకి వెళ్లాలనుకున్నప్పుడు డ్రస్‌పైకి మ్యాచింగ్‌ బ్యాగు, చెప్పులు వుంటే బాగుండాల నిపి స్తుంది. అలా అని ఎక్కువ డబ్బులుపెట్టి కొన్నా అవి వేరే వాటిపైకి వుపయోగించలేం. కాబట్టి 150 నుండి 200లోపు ఇక్కడ సెట్‌ అన్నీ కొనేయచ్చు. పార్టీలో మెరిపించొచ్చు. అందుకే కొంటున్నా’ అని కొటీలో చెప్పులు కొంటూ సరిత చెబుతోంది. ఇంతే కాదు..ఇలాంటి వారు ఎందరో... ఇప్పుడు ఇక్కడ షాపింగ్‌ చేస్తున్నారు. ఒకేలా కాకపోయినా వారంతా ఇలాంటి మాటలనే చెబు తున్నారు. 

ఫ్యాషన్‌ డిజైనర్లు... 
shoping1‘హైదరాబాద్‌ నగరం ఫ్యాషన్‌కి పెట్టింది పేరు. కొత్తగా వస్తున్న బ్రాండుల పట్ల యువతరంలో స్టైలుపై మోజు పెరుగుతోంది. వీధి దుకాణాల వారిలో కూడా అవగాహన పెంపొందుతోంది. ఫ్యాషన్‌ విషయంలో యువతులు పొరపాట్లు చేయడానికి అవకాశం ఇవ్వరు.వారికేం కావాలో బాగా తెలుసు. కాబట్టి వీధుల్లో అమ్మే దుస్తులు కొనుక్కోవడం తప్పేమీ కాదని అం టోంది’ ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీషా. ‘ఫాషనబుల్‌ అంటే వేసు కోవడానికి సుఖంగా వుండేవి, నాగరికంగా ఉండేవి మాత్రమే. చౌకధరకు వీధుల్లో అమ్మే దుస్తులు కొనడం తేప్పేమీకాదు. కానీ కొనుగోలుదారులు సరికొత్త పంథా ఫ్యాషన్‌ను తెలుసుకుని కొనా లి. అలా అని ఏవి పడితే అవి కొన్నా కూడా నష్టపోతారు. అందుకే పొరపాట్లు చేయకూడదు’ అని అమ్మాయిలకు సలహా ఇస్తోంది. ఎన్ని వున్నా డిజైనర్‌ దుస్తులకు మాత్రం ఆదరణ తగ్గదని ఆమె అంటోంది. 


-హైమ సింగతల
Surya teludu daily, March 14, 2011

Tuesday, 5 August 2014

స్వేచ్ఛకై నినదించిన నగారా..!

తరతరాల మహిళా స్వేచ్ఛ కోసం పోరాటాలు చేసింది... ఇరాన్‌లో అడుగం టిన మహిళల హక్కుల కోసం ఆమె తన గళమెత్తింది... లక్ష్యసాధనకోసం లాయర్‌గా మారింది... తనని నమ్ముకున్న తోటి మహిళల కోసం జర్నలిస్ట్‌గా మారి తన కలాన్ని ఖడ్గంలా ఝుళిపించింది... పాలకుల దమననీతిపై సంకుల సమరం సాగించి మతఛాందసవాదులనుంచి ప్రాణాలకు ముప్పువుందని తెలిసినా మొక్కవోని ధైర్యాన్ని ప్రదర్శిస్తోంది... అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థల సహాయంతో ఇరాన్‌ మహిళల హక్కుల కోసం పోరాడుతోంది. ఇప్పుడు ఆమె ఒక వ్యక్తి కాదు... లక్షలాది ఇరాన్‌ మహిళలపాలిట ఆశాజ్యోతి... మహిళా స్వేచ్ఛపై మారుమోగిస్తున్న ఒక సంగ్రామ భేరి...ఆమే ఇరాన్‌ షేర్ని షాదిసహర్‌...

IranWomenతెహ్రాన్‌ యూనివర్సిటీలో 1999లో మాస్టర్స్‌ డిగ్రీ చేసింది. అప్పటిదాకా మహిళల చదువుల పై కూడా ఆ దేశంలో ఎన్నో ఆంక్షలు...కేవలం వేళ్లమీద లెక్కపెట్టుకునే విద్యాసంస్థలే మహి ళలకు సీట్లు ఇచ్చేవి. పైగా వారు కోరుకున్న డిగ్రీలు కాక ఏదో ఆర్ట్స్‌లో మ్త్రామే ప్రవేశ కోర్సులు ఉండేవి. అయినా షాది సహర్‌ ఉన్నత చదువులమీద ఆసక్తితో మాస్టర్స్‌ డిగ్రీ చేసింది. చదువు కునే రోజులనుంచే మహిళల సమస్యలను బాగా ఆకళింపు చేసుకుంది. అనేక విద్యార్థి ఉద్యమా లలో పాల్గొని అనేకసార్లు కళాశాల, యూనివర్సిటీ అధికారుల ఆగ్రహానికి సైతం గురయ్యింది. చిన్నప్పటినుంచి షాది ముక్కుసూటితనం, నమ్మిన సిద్ధాంతాల కోసం పాటుపడే లక్షణాలతో... చాలా మంది మిత్రులను కూడా దూరం చేసుకుంది. 

మహిళల కోసం...
మహిళా హక్కుల కోసం ఊరికే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వక ఆచర ణలో పెట్టి చూపించింది. చదువుకునే రోజుల్లో తన మిత్రురాళ్లతో అన్న మాటలను నిజంచేసి చూపింది. కేవలం తన ఒక్కదాని వలన ఉద్యమం బలోపేతం కాదని తెలుసుకుంది... తనతో పాటు సరిసమానంగా పనిచేసే కొంద రు టీమ్‌ను తయారుచేసుకుంది. ‘రోహి’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించింది. లాయర్‌గా పేదవారికి ముఖ్యంగా మహిళలకు సంపూర్ణ న్యాయం చేయాలనే లక్ష్యంతో ఆమె తన జీవన గమనాన్నే మార్చేసుకుంది. ఆమె స్థాపించిన రోహి సంస్థ ద్వారా ఇప్పటికే ఇరాన్‌లో అనేక మంది మహిళల తరపున డిఫెన్స్‌ లాయర్‌గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కేసులను వాదించింది. చాలా కేసుల్లో విజయం సాధించింది. 

స్వచ్ఛంద వెబ్‌సైట్‌...
మహిళల కోసం షాదిసహర్‌ ఏకంగా ఒక వెబ్‌సైట్‌నే ఆరంభించింది. ఆన్‌లైన్‌ ద్వారా వారి సమ స్యలను ఉచితంగా పరిష్కరిస్తోంది. ఉమెన్‌ ఇన్‌ ఇరాన్‌ అనే వెబ్‌సైట్‌ ఇప్పటికే ఆ దేశంలో బాగా పాపులర్‌ అయింది. దేశంలో ఏ మూల ఉన్నా మహిళలు ఈ వెబ్‌సైట్‌ ద్వారా షాదిని ప్రత్యక్షంగా కలుసుకోలేకపోయినా...పరోక్షంగా తమకు న్యాయం కలిగేలా చూసుకుంటున్నారు. ఇరాన్‌ లో అనేక మతఛాందస సంస్థలు ఇప్పటికే షాదిపై ఓ కన్నేశాయి. షాది ప్రాణాలకు ముప్పు ఉన్న దని తెలిసినా ఆమె ఏనాడూ తన ప్రాణాలకోసం అల్లాడలేదు. 2003 సంవత్సరంలో ఇరాన్‌లో సంభవించిన ఘోరమైన భూకంపంలో అనేక ప్రాంతాలు నేలమట్టం అయిపోయాయి. వెంటనే స్పంది ంచిన షాది అప్పటికప్పుడే నిధులు సేకరించి ఒక్కరోజులోనే ఆ ప్రాంతానికి చేరుకుంది. 

అక్రమ అరెస్ట్‌లు...
2009 జూన్‌ 14వ తేదీన ఆమెను ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్‌ చేయించింది. మహిళా హక్కుల కోసం పోరాటం సాగిస్తున్న శివనజర్‌ అహ్రి తరపున షాది డిఫెన్స్‌ లాయర్‌గా వాదించిన నేరానికి షాదిపై అక్రమ నేరం మోపి అరెస్ట్‌ చేయించింది ప్రభుత్వం. 2007లో కూడా షాదితో సహా 33 మంది మహిళలు అరెస్ట్‌ అయ్యారు. కేవలం వారు చేసిన నేరం ఏమిటంటే అక్కడి మతాచారాలకు విరుద్ధంగా వారంతా సాధారణ సివిల్‌ దుస్తులు ధరించి ముస్లింలు ప్రార్థనలు జరుపుకునే మసీదు ముందరనుంచి వెళ్లడం... దీంతో అక్కడ కొందరు మతవాదులు వారిని వెంబడించి తరిమారు. దాదాపు షాదిపై హత్యా యత్నం జరిగింది. ఇంత జరిగినా ప్రభుత్వం చీమకుట్టినట్టు కూడా స్పందించక షాదినే ముస్లిం మహిళలను రెచ్చగొడుతోందని... మత సంప్రదాయాలను ధిక్కరించినందుకు, ఉద్రేకపూర్వ కప్రసంగాలు చేస్తున్నందుకు ఆమెపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్‌ చేయించింది ప్రభుత్వం.

జర్నలిస్ట్‌గా... 
షాదిసహర్‌ లాయర్‌ మాత్రమే కాదు... మహిళా హక్కుల కోసం నినదించిన జర్నలిస్ట్‌. ఆది నుంచి ఆమెలో రగులుతున్న కసే ఆమెను జర్నలిస్ట్‌గా మార్చింది. మహిళా సమస్యలపై అనే క ఆర్టికల్స్‌ ఆమె వివిధ పత్రికలలో అచ్చయ్యాయి. ఇది కేవలం మహిళలను అవగాహన కల్పించడానికి తప్ప పేరుప్రఖ్యాతల కోసం కాదని ఆమె అనేవారు. తన గొంతులో ప్రాణం ఉన్నంతవరకూ ఈ దేశపు మహిళ కోసం... అణిచివేయబడిన వారి హక్కుల కోసం నిరంతర పోరాటం సాగిస్తునే ఉంటానంటారు. 

-హైమ సింగతల
Surya telugu daily

Sunday, 3 August 2014

యుద్ధభూమిలో స్థానం కావాలి..!

భారత ప్రభుత్వం ఆర్మీలో సేవలం దించేందుకు మహిళలను ఉద్యోగా లకు తీసుకునేందుకు శాశ్వత కమిషన్‌ నెలకొల్పుతోంది. దీని ద్వారా న్యాయ, విద్యా విభాగాల్లో మహిళలను నియమిస్తారు. కానీ పోరాటం చేసే కంబాట్‌ శాఖను మాత్రం ఈ కమిషన్‌ పరిధి వెలుపలే వుంచేశారు.మహిళలే స్వయంగా ముందుకొస్తున్నప్పటికీ సైనిక దళాల్లో స్త్రీని మాత్రం కేవలం సున్నితమైన పనులకు పరిమితమైన వారిగానే చూస్తున్నారు. ఎందరో యువతులు దేశ రక్షణలో తామూ భాగస్వాములమవ్వాలని కోరుకుంటున్నారు. కేవలం న్యాయ, విద్య వంటి వాటికే పరిమితం కాకుండా తమకూ అన్నిటా అవకాశం కల్పిస్తే తామేంటో నిరూపించుకోవాలని తహతహ లాడుతున్నారు. సైన్యంలో వివక్షను వీడాలని ఆ శాఖలోనే పనిచేస్తున్న ఎందరో అధికారిణులు కూడా కోరుతున్నారు. వారు తమ అభిప్రాయాలను ఈ విధంగా చెబుతున్నారు.

విధులు ఇలా వుంటాయి...
trining''పోరాటం చేసే శాఖలో నియమితులయ్యే ఆఫీసర్లకు కఠినమైన ప్రాంతాల్లో పోస్టింగు వచ్చే అవకాశం వుంది.అక్కడి నుండి వారిని సరిహద్దు ప్రాంతాలకు కూడా తరలిస్తారు. అలాంటి స్థలాల్లో సాధారణంగా మహిళల్ని మద్దతునిచ్చే పనులకు, లేదా పాలనా పరమైన పనులకే పరిమితం చేస్తారు. పురుషుల్ని సరిహద్దులకు పురమాయిస్తారు. మంచులో కూరుకుపోయిన హిమాలయానికిగానీ, వాస్తవాధీన రేఖ వద్ద బంకర్‌గానీ- ఎక్కడికైనా పురుషుల్నే తరలిస్తారు. 

ఒకే బంకర్‌లో ఎందరో పురుషు లతోపాటు కలిసి పని చేయడం ఒక మహిళాధికారిణికి అనువుగా వుండదని వారి అభి ప్రాయం కావచ్చు. స్నానపానాదులకు ప్రత్యేకించి దీర్ఘ కాలిక వసతులు అక్కడ వుండవు.అయినా సరే మహిళలు ఇక్కడ నియామకాల్లో అవకాశం కోరుతున్నారు. కానీ అక్కడి అధికారులకు మాత్రం ఇది ఇష్టం లేదు'' అని పేరు చెప్పడానికి నిరాకరించిన ఒక మహి ళాధికారి అంటున్నారు. దీనివల్ల ఎప్పుడూ కఠినమైన విధులు నిర్వహించే యువ పురుష ఆఫీసర్లలో సులువైన పనులు చేసే మహిళాధికారంటే కడుపుమంటకు దారితీస్తుందని కొలువులోవున్న లెఫ్టెనెంట్‌ కల్నల్‌ ఒకరంటున్నారు.

భార్యాభర్తలైతే...
సాధ్యమైనంత వరకు భార్యాభర్తల్ని ఒకే చోట డ్యూటీ వేయడానికి సైన్యం ప్రయత్నిస్తుం టుంది. కానీ దీనికీ పరిమితులున్నాయి. ఉద్యోగరీత్యా దంపతులిద్దరూ ఏకకాలంలో శాంతి ప్రదేశానికి గానీ యుద్ధభూమికిగానీ వెళ్ళే స్థాయిలో ఉండకపోవచ్చు. లేక వారిరువురూ అందించే సేవలు ఒకే చోట అవసరముండకపోవచ్చు. ఖాళీ లేనం దువల్ల దంపతులిరువుర్నీ ఒకే చోట డ్యూటీ వేయలేరు. వారి సంక్షేమాన్ని పట్టించుకోవ డం లేదని సైన్యంలో ఆఫీసర్లలో గుర్రుకు ఇది దారితీస్తోంది. మహిళాధికారులకు శాశ్వత కమిషన్‌ కల్పిస్తే ఈ సమస్య తీవ్రమవుతుందన్నది మరో వాదన కూడా! ఇంచుమించు 21వ ఏళ్ళ వయసులో సర్వీస్‌లో చేరే మహిళాధికారి నాలుగైదేళ్ళపాటు సేవలందించిన తర్వాత పెళ్ళి చేసుకుంటుంది. సైన్యంలో చేరేటప్పుడు ఉత్సాహంతో ఉంటారు. పెళ్ళ వగానే ప్రాధాన్యతలు మారిపోతాయి. పెళ్ళి తరువాత ఇంటివైపు ఆ పై పిల్లల వైపు మొగ్గు పెరుగుతుంది. తీవ్రవాద ప్రాంతంలో డ్యూటీవేస్తే పిల్లల్ని తీసుకువెళ్ళడానికి వెనుకాడు తారు అనే వాదనలు కూడా ఇక్కడ వినిపిస్తున్నాయి. అందుకే మహిళా అధికారులను నియమించడం లేదని తెలుస్తోంది. 

సామాజిక బంధనాలు...
సామాజిక బంధనాలను విడిచి మహిళలు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడానికి సహక రించలేరని ఆర్మీలో పనిచేస్తున్న పురుష అధికారులు అంటున్నారు. ''మన సమాజంలో నెలకొన్న ఆచార వ్యవహారాల ప్రకారం భర్తవద్ద వుండడం కోసం మహిళలే తమ ఉద్యో గాలను విడిచి పెట్టేయడానికి సాధారణంగా సిద్ధపడతుంటారు. భర్తతో పాటు వుండడం కోసం భార్య ఉద్యోగం మానుకున్న సంఘటనలు సైన్యంలోనే ఎన్నో చోటు చేసుకుంటు న్నాయి. భార్య అనేక చోట్ల ఉద్యోగం చేస్తూ దేశం పట్టి తిరుగుతుంటే భర్తమాత్రం ఒకే చోట పిల్లల్ని కనిపెట్టుకుని వుండడానికి ఇష్టపడతాడా? ఈ నియమాల్ని అంగీకరించ డానికి నేటి మహిళ సుముఖంగా వుందా?'' వంటి ప్రశ్నలు వారు వేస్తున్నారు. 

మేము ఎందులోనూ తక్కువ కాదు...!
michellenorrisసామాజిక నియమాలు, కుటుంబంలో మహిళ స్థానానికి సంబంధించినవి. అవి వ్యక్తి గతం. ఇటువంటి సాకులు చూపి తమను తమ పట్ల పక్షపాత వైఖరి అవలంభించడం మహిళలకు ఇష్టం లేదు. తమ కలలను తామే కాల రాసి ఈ నియమాలు గుడ్డిగా స్వీకరిం చి ఆచరించడానికి వారు సిద్ధంగా లేరు. ''నేను కూడా రక్షణ విభాగంలోనే పని చేయాలని ఎప్పటి నండో కలలు కంటున్నాను. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను''' అంటూ ఓ మహిళా అధికారి చెబుతున్నారు. వారు పురుషులతో సమాన హోదా, మర్యాద కోరు తున్నారు. వారు దానికి అర్హులు కూడా. 

పురుషుల్ని పంపించే పోస్టులకు డ్యూటీలకూ తమనీ పంపించాలని పురుషులకు వర్తించే కొలమానాల్నే పాటిస్తూ తమకూ పదోన్నతు లివ్వాలనీ వారు కోరుతున్నారు. వారి ప్రతిభను రుజువుచేసుకోవడానికి సరైన అవకాశ మివ్వడం చాలా ముఖ్యం అని రిటైరైన మేజర్‌ అనామికా కపూర్‌ అంటున్నారు. ఎవరైతే అసమర్థులో వారిని ఏరేసి మిగతావాళ్ళకు సముచితమైన అవకాశాలు కల్పించాలం టోంది ఆమె. కొలువులో చేరిన మరుక్షణమే తమ వృత్తిపరమైన అవసరాలను, ప్రయోజ నాలను గ్రహిస్తామని మహిళాధికారులు శపథం చేస్తారని కనుక సైన్యం మహిళలు పురు షులతో సమానంగా అవకాశాలు కల్పించాలని రిటైరైన లెఫ్టెనెంట్‌ కల్‌నల్‌ సంగీతా సరా ్దనా అంటున్నారు.ఏది ఏమైనా తమలోనూ పోరాట పటిమ ఉందంటున్న మహిళలకు ఒక అవకాశం ఇవ్వాలని నేటితరం యువతుల అభిప్రాయం.

-హైమ సింగతల
surya telugu daily, October 15, 2010

Saturday, 2 August 2014

బాధల్లో మెరిసిన భాగ్యం..

జీవితాంతం కష్టనష్టాల్లో తోడుగా వుంటానంటూ ప్రమాణం చేసిన భర్త మరొకరిని పెళ్లిచేసుకున్నాడు.కట్టుబట్టలతో, చేతిలో కొడుకుతో ఒంటరి ప్రయాణం... దొరికిన పని చేసుకుని పొట్టగడుపుకుంటున్న తరుణంలో తల్లిమరణం. ముగ్గురు చెల్లెల్లు, తమ్ముడి బాధ్యత.. కొంత కాలానికే తండ్రి మరణం.... ఇది ఏదో సినిమా కథ కాదు.. ఓ పల్లెటూరి అమ్మాయి జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు.. బాధల్లోనుండి మెరిసిన ఓ ‘భాగ్యం’ కథ.

bhagyamకందుకూరు మండ లం దెబ్బగూడకు చెందిన ఓ పేదరై తుకు పుట్టిన ఐ దుగురి సంతా నంలో పెద్ద కూ తురిగా పుట్టింది భాగ్యమ్మ. 24 ఏళ్ల క్రితం ఓ వ్య క్తికిచ్చి వివాహం చేయగా ఆ వివాహం కొంత కాలానికే చెదిరిపోయింది. ఎంత చెప్తున్నా వినకుండా భాగ్యం భర్త మరో పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆమె తన కొడుకును తీసుకుని బయటకు వచ్చేసింది. కూలీ నాలీ చేసుకుంటూ తన కొడుకును పోషించుకునేందుకు ప్రయత్నించింది. కడుపు నింపుకోవడానికి ఎన్నో కష్టాలు పడింది. తన తల్లి మరణంతో మరింత కుంగి పోయింది. 

కుటుంబానికి తోడుగా...
కుటుంబానికి తోడుగా వుండేందుకు పుట్టింటికి చేరింది. వున్న ఆరు ఎకరాల భూమిలో సాగు చేయ డంలో తండ్రికి సాయంగా నిలిచింది. ఆధునిక పద్ధతులను అవలంబించి లాభాలు గడించడం ప్రా రంభించింది.ఇందుకు ఆమె ఆకుకూరల సాగును ఎన్నుకుంది. ఆధునిక పద్ధతులైన డ్రిప్‌ ఇరిగేషన్‌, స్పింక్లర్ల ద్వారా వ్యవసాయాన్ని చేయడంలో ఎంత లాభం వుందో తెలుసుకుంది. 

తండ్రి మరణం...
కుటుంబాన్ని ఓ దారిలోకి తెచ్చే సమయంలో మరో ఎదురు దెబ్బ. తండ్రి మరణం. దీంతో భారం మొత్తం భాగ్యం మీదే పడింది. ముగ్గురు చెల్లెల్లు. ఒక తమ్ముడు. అందరి బాధ్యతా ఆమెపైనే. ఆ కష్టాన్ని దిగమింగి తిరిగి తన బాధ్యతలను నిర్వర్తించడంలో నిమగ్నమైపోయింది.

తనకు తెలిసింది ఒక్కటే...
polamవ్యవసాయం తప్ప చిన్న తనం నుండి భాగ్యంకు మరో విషయం తెలియదు. ఆమెకు అదే వ్యాపకం.వృత్తి.అన్నీ అందులోనే ప్రయోగా లు మొదలుపెట్టింది.విజయం సాధించిం ది. తక్కువ మొత్తంలో ఎక్కువ లాభాలు గడిం చేందుకు కావలసిన ఆధునిక పద్ధతులను ప్రవేశపె ట్టింది. అలాగే పంట మార్పిడి విధానాన్ని అవలంబించింది. 

కుటుంబాన్ని ముందుకు నడిపింది...
భాగ్యం తన ఇద్దరు చెల్లెళ్లకు పెళ్లి చేసింది. తమ్ముణ్ని చదివిస్తోంది. తనకు తోడుగా వుండేందుకు కొడుకుకు వ్యవసాయంలో శిక్షణ ఇస్తోంది. ఇప్పుడు ఆమె కొడుకే ఆమెకు తోడు. తన కుటుంబాన్ని ముందుకు నడిపించడమే తన లక్ష్యం. వ్యవసాయమే ఆమె నేస్తం. బాధలనే భాగ్యంగా మలచుకున్న భాగ్యం ఓ స్ఫూర్తిప్రదాత.
-హైమ సింగతల
surya telugu daily January 5, 2011

Friday, 1 August 2014

అలివిగాని సమయంలో తెలివిగా...

సమయం ఎప్పుడూ ఒకే రకంగా వుండదు. కొన్ని సందర్భల్లో అన్నీ చేతుల్లోనే వున్నట్లు వుంటాయి.మరికొన్ని సందర్భాల్లో ఏమీ చేయలేమనే స్థితికి పరిస్థితులు వెళ్తాయి. ఎంతో కష్టపడి చదువు ముగించుకున్నాక ఉద్యోగం విషయం తీసుకుంటే తోటి వారికి ఇట్టే దొరుకుతుంది.. ఎంత కష్టపడినా మనకు మాత్రం దొరకదు. అలా అని లోపం వుందా అంటే అదేమీ కనిపించదు. ఎందుకు మనకే ఇలా జరుగుతుంది అన్న ప్రశ్న కూడా మెదడులో మెదులుతుంది. కానీ ఆలోచిస్తే అటువంటి సమయంలోనూ ఓ మంచి ఆలోచన తడుతుంది.

happyకొన్ని సమస్యలు పెద్దగా ఇబ్బంది పడకుండానే విడిపోతాయి.మరికొన్ని జీవితాలను చిందర వందర చేసి వదిలిపెడతాయి. దీనికి కారణం సమస్యకు పరిష్కారం లేకపో వడం కాదు దాన్ని తెలుసుకోలేకపోవడం.దీన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా వాటి మూలాలను అర్థం చేసుకోవాలి.సమస్యల్లో వున్నప్పుడు ఎవరికి వారు ఆ సమయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఏమీ చేయలేనపుడు సానుకూల ఆలోచనలను మనసులో నింపుకోవాలి. ఏ సమస్య అయినా ఎక్కువ కాలం వుండదు అనే తలంపుతో ముందడుగు వేయాలి. ఎక్కువ కాలం అది సాగుతూనే వుంది అంటే అది జీవితం పట్ల నిర్లక్ష్యం చూపిం చడం అవుతుంది. ఓవైపు కాలం గడుస్తూనే వుంటుంది. మరో వైపు దాని పరిష్కార మార్గం కూడా బోధపడుతుందని తెలుసుకోవాలి. 

కష్ట సమయాలే తీర్చిదిద్దుతాయి...
అన్నీ చేయగల సత్తా ప్రతి ఒక్కరిలో వుంటుంది. కానీ దాన్ని గుర్తించడంలో తేడాలు వుం టాయి. కొందరు అన్నీ చేయగలం అన్న ధీమాతో ముందుకెళ్తే.. చేయగలనా లేదా అని కొందరు అలా కాకుండా అన్నిటికీ సానుకూల ఆలోచనలు అలవాటు చేసుకుంటే విజ యం కూడా చాలా సులువుగా కనిపిస్తుంది. కష్టకాలం ఇట్టే కరిగిపోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా లోపల దాగున్న కష్టపడేగుణం, ఓర్పును వెలికి తీయాలి.ప్రత్యేకతలను గుర్తిం చి వాటికి పదును పెట్టాలి. చదువు వల్ల ఉద్యోగం రాకపోతే ఏమి ఇతర అంశాలను వుప యోగించి కూడా సాధించుకోవచ్చు అనే విషయం అర్థం చేసుకోవాలి.

ఒళ్లు చెడేలా వద్దు.. 
ఎవరో పిలిచి ఉద్యోగం ఇస్తారు అని తిని కూర్చుంటే ఆరోగ్యం పాడవడటం తప్ప ఇంకేమీ జరగదు.అందుకే ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా ప్రయత్నాలను పెం చుకుంటూ పోవాలి.ఎంత ఎక్కువగా ప్రయత్నిస్తే అంతగా సాధించాలనే పట్టుదల వస్తుంది. సమయం కూడా అనుకూలిస్తుంది.

పంచుకుంటే మేలు...
సగం సమస్యలు బయటికి చెప్పుకోకుండా మెదడులోనే నిల్వ చేసుకోవడం వల్ల కొనసా గుతూ వుంటాయి.వాటికి పరిష్కార మార్గం దొరికే వరకు బాధపెడతాయి. దీని నుండి విముక్తి పొందాలంటే వీటిని ఎప్పటి కప్పుడు స్నేహితులతో పంచుకోవడం నేర్చుకోవాలి. దీని వల్ల ఒత్తిడి నుండి ఉపశమనం మాత్రమే కాదు స్నేహం కూడా బలపడుతుంది. ఆనందం కలుగుతుంది. 

సమయం ఆగదు..
ఎప్పుడూ మనసులో ఓ విషయాన్ని గుర్తు చేసుకుంటూ వుండాలి. ‘ఎంతటి కష్టాలు పడే సమయం అయినా ఎల్లకాలం వుండదు. సమయం ఎవరి కోసం ఆగదు. ప్రళయం వచ్చి నా ఆగదు. కాబట్టి సమస్యలు కూడా కదిలి పోతాయి’ అని అనుకుంటే జీవితంలో ఇతర విషయాలనూ నేర్చుకోవడానికి మనసు సహకరిస్తుంది. వ్యతిరేకంగా సాగే ఆలోచనల నుండి విముక్తి లభిస్తుంది. ‘నేను ఇది చేయలేను’ అని అనుకోవడం కన్నా చేయడానికి ప్రయత్నించి చూడటం అనేది ఎంతో మంచిది. సానుకూల ధోరణి గనుక వుంటే అన్నిటా విజయం సాధించేందుకు అవకాశాలు ఎక్కువగా వుంటాయి.ఏ కష్టమైనా ఏదో ఒక కారణం వల్లే వస్తాయి. వీటి నుండి ఎంతో నేర్చుకోవాలి. అలాగే ప్రతి విషయంలోనూ అన్వయించుకోవాలి.ఏదీ కారణం లేకుండా రాదు అనుకోవాలి. వీటన్నిటినీ అర్థం చేసుకుంటే మంచి దానంతట అదే జరుగుతుంది.
                                                                                                                                   -హైమ సింగతల
                                                                                                                                                                 (surya telugu daily March10, 2011)